సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 21, 2020 , 00:43:56

అంతటా అప్రమత్తం..

అంతటా అప్రమత్తం..

  • కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
  • జిల్లాలో గ్రామ స్థాయి  వరకు అధికారుల అప్రమత్తం..
  • జిల్లాకు విదేశాల నుంచి 29మంది  వచ్చినట్లు గుర్తింపు
  • వారిపై ప్రత్యేక నిఘా వుంచిన అధికారులు
  • జిల్లాలో కరోనా వైరస్‌ బాధితులు ఒక్కరు కూడా లేరు...
  • త్వరలో జిల్లా ఏరియా దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు 
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల సూచన

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, భయాందోళనలు పోగొట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్‌ నుంచి ్రగ్రామస్థాయి అధికారుల వరకు అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉన్నారు. మార్చి 1 నుంచి ఇతర దేశాల నుంచి ఎంతమంది జిల్లాకు వచ్చారో వివరాలు సేకరించారు. వారందరినీ కలిసి ఇంటినుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, జనసందోహాలుగా ఉండొద్దని  పల్లెల్లో చాటింపు వేయించి, పట్టణాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ ధర్మారెడ్డి సబ్బుతో చేతులు కడుక్కొని.. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఐసోలేషన్‌ కే్ంరద్రాన్ని ్రప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు.

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కరోనా నిర్మూలనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందననదీప్తిల ఆధ్వర్యంలో గ్రామాల నుంచి జిల్లాస్థాయి వరకు విదేశీయుల రాకపై నిఘా పెంచింది. ఈ రోజు వరకు 29మంది విదేశీయులు వివిధ దేశాల నుంచి మెదక్‌ జిల్లాకు వచ్చినట్లు గుర్తించారు. వారిని ప్రత్యేకంగా వారి ఇండ్లలోనే క్వారంటైన్‌ చేస్తూ వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఒక్కో వ్యక్తికి ఒక్కో అధికారిని పూర్తిగా పరిశీలనకు ఎంపిక చేశారు. కరోనావ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఎస్పీ, కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలతో రాపిడ్‌ రెస్పాన్స్‌ టీం ఏర్పడింది. అంతేకాకుండా పోలీసు శాఖ పక్షాన గ్రామానికి ఒక పోలీసు అధికారిని నియమించి విదేశాల నుంచి వచ్చే వారి సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఇంటలిజెన్స్‌ వర్గాల నిఘాతో పాటు గ్రామ కార్యదర్శులు, వీఆర్‌ఏలు, సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధులు, మండల, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆదేశాలిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ పక్షాన వైరస్‌ సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, గుంపుగుంపులుగా ఉండకుండా వివాహ, ఇతర వేడుకలకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో డప్పుచప్పుళ్లతో చాటింపు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. కరపత్రాలు, బ్యానర్‌లతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ఉండాలంటే స్వీయ వ్యక్తిగత నియంత్రణ అవసరం అని ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 29మంది విదేశీయులు వచ్చినప్పటికీ వారికి ఆయా గ్రామాల్లోనే వారి ఇండ్లలోనే క్వారంటైన్‌ చేసి చికిత్సలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విదేశీయుల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ముగ్గురిని గాంధీ దవాఖానకు పంపించగా వారికి కరోనా వైరస్‌ లేదని తేలిందని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి వెల్లడించారు. 

సీఎం కేసీఆర్‌ ప్రకటనతో  స్పందించిన అన్ని మతాల పెద్దలు 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలకు అన్ని మతాల పెద్దలు స్పందించారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ కెథడ్రల్‌ చర్చిలో ఈనెల 31వరకు భక్తులను రాకుండా నిలిపివేసినట్లు మెదక్‌ డయాలసిస్‌ అధ్యక్ష మండలం బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ సాల్మన్‌రాజ్‌ ప్రకటించారు. ఆదివారం చర్చిలో జరిగే అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా డయాసిస్‌ పరిధిలో చర్చిలలో సైతం భక్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మత గురువులు ప్రార్థనలు చర్చిలలో యథావిధిగా కొనసాగనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి ఈనెల 31వరకు భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ప్రకటించారు. ఉదయం యథావిధిగా అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహించి అనంతరం ఆలయాన్ని మూసివేస్తారని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు జగ్‌నేకే రాత్‌కు సంబంధించి కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయా మత పెద్దలు తెలిపారు. వీటికి సంబంధించి కార్యక్రమాలు ఇండ్ల వద్దనే జరుపుకోవాలని వారు సూచించారు. ఇలా అన్ని వర్గాలు కరోనా వైరస్‌ ప్రభావంతో ఇతరులకు సోకకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి సహకరించాలని నిర్ణయించుకున్నారు. 

సినిమా థియేటర్లు... అన్ని విద్యాసంస్థల బంద్‌ 

జిల్లాలోని సినిమా థియేటర్లు, అన్ని రకాల విద్యాసంస్థలను  బంద్‌ నిర్వహిస్తున్నారు. అలాగే ర్యాలీలు, సభలు, సమావేశాలు రద్దయ్యాయి. ఈ నెల 31 వరకే ఫంక్షన్‌హాళ్లలో వివాహాలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  

బస్టాండ్లలో అవగాహన.. జాగ్రత్తలు 

మెదక్‌ టౌన్‌ : కరోనా వైరస్‌పై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మెదక్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ జాకీర్‌హుస్సేన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం పట్టణంలోని బస్‌డిపోలోని బస్సులను నీటితో అద్దాలను, సీట్లను శుభ్రం చేసిన తర్వాతనే బస్సులను డిపో నుంచి బయటకు పంపుతున్నారు. అదేవిధంగా బస్టాండ్‌లో కరోనా వైరస్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ వైరస్‌ నివారణ చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్‌ పరిసర ప్రాంతాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. విధినిర్వహణలో ఉన్న ప్రతి  సిబ్బందికి శానిటైజర్‌ బాటిళ్లను  అందజేశారు. అలాగే ప్రయాణికుల కోసం కూడా బస్టాండ్‌లో బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ జాకీర్‌హుస్సేన్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌కు వ్యక్తిగత పరిశుభ్రతే కరోనా వైరస్‌ను రాకుండా చేయవచ్చాన్నారు. దీనిలో భాగంగా డిపోకు చేరుకున్న ఆర్టీసీ బస్సులను నీటితో శుభ్రం చేస్తున్నామని, దీంతో పాటు విధులకు హాజరయ్యే సిబ్బందికి కూడా శానిటైజర్‌ బాటిళ్లను అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ తిరుమలేశ్‌లు ఉన్నారు.

పెండ్లివారికి కరోనాపై అవగాహన

టేక్మాల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని పంచాయతీ కార్యదర్శి బలరాం పేర్కొన్నారు. మండల పరిధిలోని ధనూర గ్రామంలో శుక్రవారం పెండ్లి కార్యక్రమం జరుగగా.. ఈ విషయం తెలుసుకున్న  స్థానిక పంచాయతీ కార్యదర్శి నందినితో కలిసి పెండ్లి మండపానికి వెళ్లారు. అప్పుడే పెండ్లికి వాహనాల్లో బంధువులు ఒక్కసారిగా వచ్చారు. అలా పెండ్లికి వచ్చిన వారందరినీ తమ చేతులను శుభ్రంగా కడుక్కొన్న తరువాతనే పెండ్లి మండపంలోకి వెళ్లాలని వ్యాధిపై వారికి అవగాహన కల్పించారు. దీంతో పెండ్లికి వచ్చిన బంధు, మిత్రులు చేతులను శుభ్రంగా కడుక్కొని హాజరయ్యారు.


logo