శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 20, 2020 , 01:04:43

‘పది’ పరీక్షలు షురూ..

‘పది’ పరీక్షలు షురూ..

  • తొలి రోజు ప్రశాంతం
  • జిల్లా వ్యాప్తంగా 66 పరీక్ష  కేంద్రాల్లో  99.77 శాతం విద్యార్థులు హాజరు
  • 11,479 మందికి గాను 11,453 మంది విద్యార్థులు హాజరు
  • 26 మంది విద్యార్థులు గైర్హాజరు
  • పాపన్నపేట మండలంలో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈవో రమేశ్‌కుమార్‌

మెదక్‌ రూరల్‌: గురువారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో  సజావుగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 66 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు ప్రథమ భాష పరీక్షకు 11,479 మంది విద్యార్థులకు గాను 11,453 మంది విద్యార్థులు హాజరు కాగా 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి రమేశ్‌బాబు విలేకరులకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 99.77 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. తొలిరోజు పరీక్షలకు విద్యార్థులు తల్లిదండ్రులతో, వారివారి బంధువులతో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. పాపన్నపేట మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను డీఈవో సందర్శించారు. నర్సాపూర్‌లో పరీక్ష కేంద్రాలను జిల్లాస్థాయి పరిశీలకులు సందర్శించారు. అల్లాదుర్గం, నర్సాపూర్‌, రామాయంపేట, నిజాంపేట్‌ మండలాలలోని 17 పరీక్ష కేంద్రాలను ప్లయింగ్‌ స్కాడ్స్‌ తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ డిబార్‌ కానీ, మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడలేదన్నారు.  

పరీక్ష కేంద్రం వద్ద హ్యాండ్‌ వాష్‌ సౌకర్యం

పరీక్ష రాసే విద్యార్థులకు కరోనా వైరస్‌ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో చేతులు శుభ్ర పరుచుకోవడానికి సబ్బులు, శానిటైజర్‌, నీటిని అందుబాటులో ఉంచారు. మెదక్‌ బాలుర పాఠశాలలో హ్యాండ్‌ వాష్‌ తరువాతే కేంద్రాల్లోకి వదలారు. కొంత మంది విద్యార్థులు మాస్క్‌ వేసుకొని పరీక్షలకు హాజరయ్యారు.

జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలోని 6 పరీక్ష కేంద్రాల్లో 1,094 మంది విద్యార్థులకు గాను ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మెదక్‌ మండలంలోని మక్తా భూపతిపూర్‌ పరీక్ష కేంద్రంలో 226 మంది విద్యార్థులకుగాను ఒకరు మాత్రమే గైర్హాజరయ్యారు.


logo