సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 20, 2020 , 01:01:40

నో కరోనా.. నో హైరానా

నో కరోనా.. నో హైరానా

  • అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
  • జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది
  • మరో మూడు రోజుల్లో జిల్లా కేంద్ర దవాఖానలో ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులు ఏర్పాటు
  • జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌
  • గ్రామాల్లో కరపత్రాలను పంచుతూ విస్తృత ప్రచారం
  • చేతుల శుభ్రం తర్వాతే ‘పది’ పరీక్షలకు అనుమతి
  • కరోనాపై జిల్లాలో ముందస్తు జాగ్రత్తగా అవసరమైన చర్యలు
  • జిల్లాలో కరోనా వైరస్‌ భయం లేదు: డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ప్రతి పల్లెలో వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంచుతూ అవగాహన కల్పిస్తున్నది. ముందు జాగ్రత్తే ముఖ్యమని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను సైతం చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బాధితులు కానీ, అనుమానితులు కానీ లేరని పేర్కొన్నది. అయినా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని దవాఖానలో మూడు రోజుల్లోగా 15 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డును, మరో 8 బెడ్లతో ఐసీయూను సిద్ధం చేయనున్నట్లు జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్‌ భయం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు.

మెదక్‌, నమస్తే తెలంగాణ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ ధర్మారెడ్డితో పాటు సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. మరో మూడు రోజుల్లో జిల్లా కేంద్రంలోని దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయనున్నారు. 15 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డును, మరో 8 బెడ్లతో ఐసీయూను సిద్ధం చేయనున్నారు. 

గ్రామాల్లో కరపత్రాలతో ప్రచారం 

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారిని అబ్జర్వేషన్‌లో పెట్టారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కరపత్రాలు పంచుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

చేతులు శుభ్రం తర్వాతే పరీక్షలకు అనుమతి 

గురువారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సెంటర్‌లోనికి వెళ్లాలంటే ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకున్నాకే కేంద్రంలోకి అనుమతించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఈవో రమేశ్‌కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

జిల్లాలో మూడు కేసులు నమోదు 

జిల్లాలో కరోనా వైరస్‌పై భయాందోళనలకు గురిచేసేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాధి గురించి వాట్సాఫ్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీరిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

కరోనా నివారణపై అవగాహన

పాపన్నపేట: ముందు జాగ్రత్త చర్యలతో కరోనా  అరికడుదాం అనే నినాదంతో ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం భక్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయలకు వివిధ రాష్ర్టాల భక్తులు వస్తుంటారు. ముందస్తు చర్యల్లో భాగంగా మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవటం చేయడం వల్ల వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవికుమార్‌, సిద్దిపేట శ్రీనివాస్‌, సూర్యశ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి  పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ భయం లేదు

కరోనా వైరస్‌కు సంబంధించి గ్రామాల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు కరోనా వైరస్‌పై అవగాహన పెంచుకోవాలి. జిల్లాలో కరోనా వైరస్‌ భయం లేదు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. జిల్లాలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారు. 

- డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో

ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాధి నిరోధించేందుకు జిల్లా కేంద్ర దవాఖానలో మరో మూడు రోజుల్లో ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులను ఏర్పాటు చేయనున్నాం. రెండు రోజుల క్రితం డాక్టర్ల బృందం డాక్టర్‌ జయరాంరెడ్డి, మురహరి జిల్లా కేంద్ర దవాఖానను సందర్శించారు. కరోనా వైరస్‌కు సంబంధించి జిల్లా కేంద్ర దవాఖానలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో మరో మూడు రోజుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయనున్నాం. 

- డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ 


logo