సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 19, 2020 , 13:22:32

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు..విద్యార్థీ విజయీభవ..

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు..విద్యార్థీ విజయీభవ..

  • నేటి నుంచే పదో తరగతి పరీక్షలు
  • 66కేంద్రాల్లో  పరీక్ష రాయనున్న 11,531 మంది విద్యార్థులు
  • నిమిషం నిబంధన సడలింపు
  • గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతి
  • విద్యార్థులు మాస్క్‌లతోనూ రావొచ్చు

మెదక్‌ రూరల్‌ : నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 66 పరీక్ష కేంద్రాల్లో 11,531 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో  ప్రైవేట్‌ విద్యార్థులు 66 మంది ఉండగా, 5,754 మంది విద్యార్థులు, 5,711 మంది విద్యార్థినులు ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తరువాత 5 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని 66 పరీక్ష కేంద్రాలకు 66 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్టుమెంట్‌ అధికారులు, 30 మంది కస్టోడియన్లు, సుమారు 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలతో పాటు సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు http://www. bsetelangana.0rg/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

నిమిషం నిబంధన సడలింపు...

ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటలకు ముగియనున్నది. గతంలో నిమిషం నిబంధనతో విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యేవారు. గడిచిన ఏడాది నుంచి దూర ప్రాంత విద్యార్థులకు ఐదు నిమిషాలు సడలింపు చేస్తూ విద్యాశాఖ అనుమతినిచ్చింది. దీంతో విద్యార్థులకు కొంత మేలు జరుగనున్నది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుంటే ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే వీలుంటుంది.

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

పరీక్ష కేంద్రాల  వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు పరీక్షలు జరిగే సమయంలో మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.  విద్యార్థులు  ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు వెంట తీసుకెళ్లరాదు. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్కులకు అనుమతి

కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థుల్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతూ అనారోగ్యంబారిన పడితే వారి కోసం ప్రత్యేక గదిలో పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతి పరీక్ష కేంద్రంలో శానిటైజర్లు లేదా లిక్విడ్‌ సోప్‌లు అందుబాటులో ఉంచుతాం. అంతేకాకుండా మాస్క్‌లు, వాటర్‌ బాటిళ్లను అనుమతిస్తున్నాం.   ప్రతి పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులతోపాటు వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. పరీక్ష కేంద్రాల వద్ద గ్రూపులుగా ఉండరాదు. పరీక్ష ముగియగానే ఇంటికి చేరుకుని వ్యక్తిగత శుభ్రతను పాటించాలి.  

-జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌logo