శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 19, 2020 , 01:00:22

కరోనాపై వదంతులు ప్రచారం చేసిన ముగ్గురి అరెస్టు..

కరోనాపై వదంతులు ప్రచారం చేసిన ముగ్గురి అరెస్టు..

  • ఎస్పీ చందనదీప్తి

మెదక్‌, నమస్తే తెలంగాణ : సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేస్తే వారి పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనదీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాపించిందని, ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఆందోళన సృష్టించి భయాందోళనకు గురి చేస్తున్న వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005(ఎన్‌డీఎంఎ యాక్ట్‌ సెక్షన్‌ 54) ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఒక సంవత్సరం పాటు శిక్షార్హులు అవుతారని, జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. వాస్తవానికి జిల్లాలో ఎవరికి కరోనా వైరస్‌ రాలేదని, దుబాయి దేశం నుంచి ఇండియాకి తిరిగివచ్చిన మెదక్‌ జిల్లా వాసులకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో వారికి ఎలాంటి కరోనా వ్యాధి సంబంధిత లక్షణాలు లేవని, ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురి చేస్తున్నారని, వీరిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.మెదక్‌ టౌన్‌ పీఎస్‌లో సాయిబాబా, చేగుంట పీఎస్‌లో సుధాకర్‌, ఆనంద్‌ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.. 

ప్రజలు ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ సోకే అవకాశం ఉన్నందున మాస్కులు ధరించాలన్నారు. వృద్ధులకు లేదా అనారోగ్యంతో ఉండే వ్యక్తులకు ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉందని వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. 

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి

ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు వెళ్లొద్దని, బయటికి వెళ్లి వచ్చిన తర్వాత  సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ఎక్కడికి వెళ్లినా వ్యక్తులకు దూరంగా ఉండి మాట్లాడాలని, మాస్కులు ధరించాలని, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. తమ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లను ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే సెక్షన్‌ 188 ఐపీసీ ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు.logo