మంగళవారం 31 మార్చి 2020
Medak - Mar 19, 2020 , 00:45:42

వల నిండుగా చేపలు దండిగా

వల నిండుగా చేపలు దండిగా

  • మత్స్యకార్మికుల జీవితాల్లో ఆనందం
  • చేపలతో ఉపాధి పొందుతున్నమత్స్య కార్మికులు
  • వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ
  • జిల్లాలో 521 చెరువులు
  • జిల్లాలో 2.11 కోట్ల చేప పిల్లలు
  • 6 లక్షల 20వేల రొయ్య పిల్లలు

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని కులాల వారు లబ్ధి పొందుతున్నారు.  జిల్లావ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో, చెరువుల్లో వదిలిన చేపపిల్లలు నేడు మత్స్యకారులకు లాభాల పంట పండిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు పదివేలకు పైగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు చేతినిండా పని దొరికింది. ప్రభుత్వం జిల్లాలోని మత్స్యకారులకు రూ.30 కోట్ల్లు కేటాయించి ద్విచక్రవాహనాలను, లగేజి ఆటోలు,  సంచార చేపల అమ్మక వాహనాలతో పాటు ఇతర సామగ్రిని   అందజేసింది.  ఈ ఏడాది  పోచారం ప్రాజెక్టులో 6.30 లక్షలు, సింగూరు ప్రాజెక్టులో 59 లక్షల రొయ్యపిల్లలను వదిలారు.  జిల్లాలోని 521 చెరువుల్లో దాదాపు 2.11 కోట్ల చేప పిల్లలను పెంచుతున్నారు.  సంపదను పెంచి.. అది అందరికీ పంచాలన్న  సంకల్పంతో  సీఎం కేసీఆర్‌  మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.

మెదక్‌, నమస్తే తెలంగాణ:  జిల్లాలో 2.11కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయాలని అధికారులు టార్గెట్‌ పెట్టుకున్నారు. జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. దీంతో మత్స్యకారులకు కూడా ఉపాధి లభిస్తున్నది. ఆగస్టులో భారీగా వర్షాలు కురియడంతో చేపపిల్లలను ఆయా చెరువుల్లో వదిలారు. దీంతో చేపల పరిశ్రమలపై ఆధారపడిన 10,500 కుటుంబాలకు జీవనోపాధి లభిస్తున్నది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా జిల్లాలోని మత్స్యకారులకు రూ.30కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 2,962 ద్విచక్ర వాహనాలను, 155లగేజీ ఆటోలు, 24 సంచార చేపల అమ్మక వాహనాలు, 672 యూనిట్ల చేపల కిట్లతో పాటు ఇతర సామగ్రిని మత్స్యకారులకు అందజేశారు.

తొలిసారి రొయ్యల పెంపకంపై దృష్టి..

తెలంగాణలో మొట్టమొదటి సారిగా రొయ్యల పెంపకం సాగుపై దృష్టి సారించి మెదక్‌ జిల్లా పోచారం ప్రాజెక్టులో మత్స్య కారులకు ఉపాధి కల్పించేందుకు 6లక్షల 20వేల రొయ్య పిల్లలను వదిలి పెంచడం జరుగుతున్నది. సుమారు 30టన్నుల రొయ్యల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. జిల్లాలో ఇప్పటి వరకు చెరువుల్లో చేపట్టిన చేపపిల్లల పెంపకంతో మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం రొయ్యల పెంపకంపై దృష్టి సారించింది. ఈ ఏడాది పోచారం ప్రాజెక్టులో 6.30లక్షలు, సింగూరు ప్రాజెక్టులో 59లక్షలు రొయ్యలను వదిలారు. ఇందులో రొయ్యలు సమృద్ధిగా పెరిగితే వచ్చే ఏడాది నుంచి చెరువుల్లో పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందశాతం సబ్సిడీపై మత్స్యకారులకు చేపపిల్లలను అందజేస్తున్నది. 

ఉపాధి పొందుతున్న మత్స్యకారులు.. 

జిల్లాలో 204 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 10,500 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలోని 521 చెరువుల్లో దాదాపు 2.11కోట్ల చేప పిల్లలను పెంచుతున్నారు. ఇప్పటికే చెరువుల్లోని చేపలు 600 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు పెరిగాయి. ఇదిలావుండగా పండుగల సమయాల్లోనే కాకుండా ప్రతిరోజు చేపలను పట్టి మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు చేపలకు ధర కూడా బాగా పలుకుతున్నదని, దీంతో తాము జీవనోపాధిని పొందుతున్నామని మత్స్యకారులు సంతోషం వ్యక్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరనున్న అధికారుల లక్ష్యం.. 

ప్రభుత్వ సూచనల మేరకు ఈ సంవత్సరం భారీగా వానలు కురవడంతో మత్స్యశాఖ భారీ ఎత్తున చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాకుండా చెరువుల్లోకి కూడా నీరు రావడంతో అధికారుల ప్రయత్నాలు సఫలమయ్యాయి. అటు అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు ఇటు మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నదని అధికారులు అంటున్నారు. గత ఏడాది జిల్లాలో 2.11కోట్ల చేపపిల్లలను పంపిణీ చేసింది. అయితే వంద చెరువుల్లోకి ఆశించిన స్థాయిలోకి నీరు రావడంతో చేపపిల్లలను విడుదల చేశారు.  

ఆశించిన స్థాయిలో రొయ్యలు పెరిగితే మత్స్యకారులకు లబ్ధి..

ఆశించిన స్థాయిలో రొయ్యలు పెరిగితే మత్స్యకారులు లబ్ధిపొందే అవకాశం  ఉన్నది. జిల్లాలోని పోచారం ప్రాజెక్టులో 6.30లక్షల రొయ్యపిల్లలను వదిలాం. జిల్లాలో ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా రొయ్యల పెంపకాన్ని చేపట్టనున్నాం. జిల్లాలోని మత్స్యకారులకు రూ.30కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 2,962 ద్విచక్ర వాహనాలను, 155లగేజీ ఆటోలు, 24సంచార చేపల అమ్మక వాహనాలు, 672యూనిట్ల చేపల కిట్లతో పాటు ఇతర సామగ్రిని మత్స్యకారులకు అందజేశాం.

- శ్రీనివాస్‌, మత్స్యశాఖ ఏడీ

చేపలతో ఉపాధి పొందుతున్నాం.

చెరువుల్లో చేపలను వదిలాం. చెరువులో నీరు పుష్కలంగా ఉండటంతో చేపలు కూడా బాగా పెరిగాయి. ప్రతిరోజు చేపలను అమ్మడంతో కూలి పడుతున్నది. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

- రావెల్లి పాండురంగం, బ్రాహ్మణపల్లి


చెరువులో ఒక కేజీ వరకు చేపలు పెరిగాయి.. 

నాలుగు నెలల క్రితం చెరువులో చేపలను వదిలాం. వర్షాలు బాగా పడటంతో చెరువు నిండుకుండలా మారింది. ఇప్పటి వరకు చేపలు ఒక కేజీ బరువు పెరిగాయి. చాలా ఆనందంగా ఉన్నది. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన టీవీఎస్‌ ఎక్సల్‌పై చేపలను తీసుకెళ్లి అమ్ముకుంటున్నాం. 672యూనిట్ల చేపల కిట్లతో పాటు ఇతర సామగ్రిని మత్స్యకారులకు అందజేస్తున్నది.

- పడిగే దాసు, బండపోసాన్‌పల్లి


సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను సరఫరా చేస్తుంది. అంతేకాకుండా 155లగేజీ ఆటోలు, 24 సంచార చేపల అమ్మక వాహనాలను సరఫరా చేసింది. 

- తుపాకుల భూపాల్‌, బండపోసాన్‌పల్లిlogo
>>>>>>