బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Mar 17, 2020 , 01:30:04

అర్ధరాత్రి అనంతలోకానికి

అర్ధరాత్రి అనంతలోకానికి
  • ఆగిఉన్న లారీని డీకొట్టిన వ్యాన్‌
  • అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు
  • మెదక్‌ జిల్లా నార్సింగి హైవేలో అర్ధరాత్రి ఘటన
  • హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
  • రామాయంపేట మార్చురీకి మృతదేహాల తరలింపు
  • దవాఖాన వద్ద మిన్నంటిన స్నేహితులు, బంధువుల రోదనలు

రామాయంపేట/చేగుంట: దుబాయ్‌కి వెళ్తున్న తోడళ్లుడిని   ఒమిని వ్యాన్‌లో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో దింపి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి రామాయంపేట సర్కిల్‌ పరిధిలోని నార్సింగి జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగింది. రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌ కథనం ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వీరవాణి కృష్ణ(28), కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన పిట్ల కిష్టయ్య(60), అంజయ్య(25)లు దగ్గరి బంధువులు. తోడల్లుడైన రవిని దుబాయ్‌కి పంపేందుకు మాచారెడ్డిలోని ఓ స్నేహితుడి వ్యాన్‌లో శంషాబాద్‌ విమానాశ్రయానికి బయలు దేరారు.  అనంతరం అదే వాహనంలో తిరిగి వస్తూ అర్ధరాత్రి 3-30 నిమిషాల ప్రాంతంలో నార్సింగి శివారులోని హైవే ప్రక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరవేణి కృష్ణకు రవి స్వయాన తోడల్లుడు. రవి భార్య అనారోగ్యంగా ఉండటంతో రవి తాత పిట్ల కిష్టయ్య, తోడల్లుడు కృష్ణ, అతడి భార్య కావ్య, అజయ్‌లు విమానాశ్రయానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘోర దుర్గటన జరిగింది. అదే వాహనంలో ఉన్న కావ్య, అజయ్‌కు తీవ్రగాయాలుకాగా రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. నార్సింగి ఎస్‌ఐ రాజేశ్‌, చేగుంట ఎస్‌ఐ సుభాశ్‌గౌడ్‌, రామాయంపేట ఎస్‌ఐ మహేందర్‌ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ముగ్గురి మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుకున్న మాచారెడ్డి, గంభీరావుపేట మండలం దమ్మన్నపేట వాసులు వందలాదిగా రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు చేరుకుని బోరున విలపించారు. మృతుల బంధువులు రోదించిన తీరు ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించింది. 


logo