గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 17, 2020 , 01:25:17

మృత్యు ఘోష

మృత్యు ఘోష

మరో పది నిమిషాల్లో ఏడుపాయలకు చేరుకుంటారని సంబురంగా ముచ్చట్లు చెప్పుకుంటుండగా.. అంతలోనే చోటుచేసుకున్న ప్రమాదం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదికి నుంచి ఏడుపాయలకు డీసీఎంలో వస్తుండగా కొల్చారం సమీపంలో ఆర్టీసీ అద్దెబస్సును ఢీకొట్టి ఆరుగురు దుర్మరణం చెందారు. 11 మంది గాయలపాలై మెదక్‌ దవాఖానలోచికిత్స పొందుతున్నారు. మరో ప్రమాదంలో శంషాబాద్‌ నుంచి కామారెడ్డి, సిరిసిల్లా జిల్లాలకు వ్యాన్‌లో తరలివెళుతుండగా నార్సింగి జాతీయ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఇంకో సంఘటనలో సంగారెడ్డి జిలా సిర్గాపూర్‌కు చెందిన యువకుడు మనోహరాబాద్‌ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతూ లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మరణించాడు. ఒకే రోజు చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

  • మూడు ప్రమాదాల్లో10మంది దుర్మరణం
  • ఏడుపాయలకు డీసీఎంలో వెళుతుండగా కొల్చారం వద్ద ఢీకొట్టిన ఆర్టీసీ అద్దె బస్సు
  • సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు మృతి
  • మరో ప్రమాదంలో శంషాబాద్‌ నుంచి కామారెడ్డికి వెళుతూ అర్ధరాత్రి ఆగిఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్‌
  • అక్కడికక్కడే ముగ్గురి మృతి
  • అందరూ కామారెడ్డి, సిరిసిల్లా జిల్లా వాసులే
  • మనోహరాబాద్‌ వద్ద రోడ్డు దాటుతూ మరోవ్యక్తి మృతి
  • సంఘటనాస్థలాల్లో మిన్నంటిన రోదనలు

ఏడుపాయల్లో దావత్‌కని డీసీఎంలో బయలుదేరారు... మంచి, చెడు మాట్లాడుకుంటూ ఆనందంగా పయనిస్తున్నారు... పది నిమిషాలైతే గమ్యస్థానానికి చేరుకునేటోళ్లు.. అంతలోనే ఎదురుగా వస్తున్న బస్సు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఒక్కసారిగా డీసీఎంను ఢీకొట్టింది. అంతే భయం.. భయంగా ఆర్తనాదాలు... ఆరుగురి దుర్మరణం... అయ్యో దేవుడా అంటూ ఆ ప్రాంతమంతా దుఃఖ సాగరంలో మునిగింది. అనంతలోకాలకు వెళ్లిన విగతజీవులను చూసి గుండెలు బాదుకున్నారు.. బంధువుల రోదనను చూసిన స్థానికుల కంటనీరు ఆగలేదు.. ఈ ఘోర ఘటన కొల్చారం పొలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంగాయిపేట శివారులో సోమవారం జరిగింది.

కొల్చారం, రామాయంపేట:  ఏడుపాయల దావత్‌కని బంధువులంతా డీసీఎంలో వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కొల్చారం మండల పరిధిలోని సంగాయిపేట శివారులో ఎదురుగా వస్తున్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక మహిళ ఎగిరి డీసీఎం టైర్ల కింద పడి నుజ్జునుజ్జు కాగా, మరో నలుగురు మహిళలు డీసీఎంలోనే మరణించారు. పన్నెండు మందికి గాయాలు కాగా వారందరినీ మెదక్‌ ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మరో బాలిక మృతి చెందింది. స్థానికులు, పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదికి చెందిన గొడుగు రాములు సోమవారం ఏడుపాయల్లో చేస్తున్న దావత్‌కు బయలుదేరి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతులంతా సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు చెందినవారే. సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామానికి చెందిన చాపల మాదవి(40), కంది మండలం చేర్యాల బద్రిగూడెం గ్రామానికి చెందిన మన్నె మంజుల(40), సంగారెడ్డి మండలం ఫసల్‌వాడికి చెందిన గొడుగు రజిత(45),  పుల్‌కల్‌ మండలం వెండికోల్‌ గ్రామానికి చెందిన నీరుడి దుర్గమ్మ(55)(సంగారెడ్డి జిల్లా గంజిగూడెంలో ప్రస్తుతం ఉంటుంది), సంగారెడ్డి జిల్లా గంజిగూడెం గ్రామానికి చెందిన గుడాల మాణెమ్మ(55)లు అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్‌ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతూ సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామానికి చెందిన దిగ్వాల్‌ మధురిమ(9) మరణించింది. మరో పదకొండు మంది కుమ్మరి జానకి, అనసూయ, యాదమ్మ, ఈశ్వరమ్మ, చందు, లక్ష్మి, సువర్ణ, శివలీల, గౌరి, లక్ష్మిలతో పాటు జియా ఉద్దీన్‌(డీసీఎం డ్రైవర్‌)కి గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న  కొల్చారం ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో మెదక్‌ ఏరియా దవాఖానకు తరలించారు. మెదక్‌-సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు.  స్థానికులు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ భర్త కాశీనాథ్‌ల సహకారంతో డీసీఎం టైర్ల కింద పడి మృతి చెందిన మహిళ మృతదేహంతో పాటు మరో నలుగురి  మహిళల మృతదేహాలను ట్రాక్టర్‌లో మెదక్‌ ఏరియా దవాఖానకు తరలించారు. సంఘటనాస్థలిని మెదక్‌ అదనపు ఎస్పీ నాగరాజు సందర్శించారు. మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి సూచనల మేరకు మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌గౌడ్‌, ఆంజనేయులు, శేఖర్‌రెడ్డి, వెంకట్‌లు ఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు: కృష్ణమూర్తి, మెదక్‌ డీఎస్పీ

కొల్చారం మండలం సంగాయిపేట శివారులో ప్రమాదానికి కారణమైన అద్దె బస్సు డ్రైవర్‌ శంషూర్‌పై కేసు నమోదు చేసినట్లు మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌ను విచారణ అధికారిగా నియమించినట్లు మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి పేర్కొన్నారు.


క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్‌  

మెదక్‌, నమస్తే తెలంగాణ : కొల్చారం మండలం సంగాయిపేట గ్రామ శివారులో సోమవారం ఉదయం డీసీఎం వ్యాన్‌ను ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న సంఘటన విషయం తెలుసుకున్న  కలెక్టర్‌ ధర్మారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానకు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను పట్టుకుని రోదించడంతో అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. అంతేకాకుండా మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలను కలెక్టర్‌ చూసి చలించారు. అనంతరం  కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మృతులకు ప్రభుత్వ పరంగా ఎక్స్‌గ్రేషియా అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తిలను ఆదేశించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో సాయిరాం, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ పి.చంద్రశేఖర్‌లు ఉన్నారు.  


కంటతడిపెట్టిన మధురిమ తల్లి... ఓదార్చిన కలెక్టర్‌

ఒక్క కూతురు సారూ.. కన్న కడుపు కాలిపోయింది సారూ.. నా భర్త దావత్‌కు వద్దన్నా నా కూతురు మధురిమతో(9)తో కలిసి ఏడుపాయల దావత్‌కు వస్తున్నా.. అంటూ విలపించిన మధురిమ తల్లి మంజులను కలెక్టర్‌ ధర్మారెడ్డి ఓదార్చారు. 

క్షతగాత్రులను పరామర్శించిన డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ మాణిక్యం..

కొల్చారం మండలం సంగాయిపేట గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం పరామర్శించారు. జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న మృతదేహాలను చూశారు. 

ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి రాకపోవడం దారుణం

ఏఎస్పీ నాగరాజు సంఘటనా స్థలిని సందర్శించి మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు ఘటన జరిగిన స్థలానికి రాకపోవడం దారుణమన్నారు. బస్సు కండీషన్‌, డ్రైవర్‌ పాటించాల్సిన నిబంధనలను చెప్పిన తర్వాతే ఆర్టీసీ బస్సును రోడ్డుపైకి అనుమతిస్తారు. కానీ అద్దె బస్సుపై నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.


logo
>>>>>>