గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 16, 2020 , 01:32:07

జిల్లాలో కరోనాపై ముందస్తు చర్యలు

జిల్లాలో కరోనాపై ముందస్తు చర్యలు
  • వైరస్‌ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • మెదక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7331186780
  • జిల్లా కేంద్ర దవాఖాన నంబర్‌ 08452-221271
  • ఈ నెల 31 వరకు పాఠశాలలు బంద్‌
  • సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌లు బంద్‌
  • యథావిధిగా టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

మెదక్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌పై జిల్లా యంత్రాంగం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా వైరస్‌ నిరోధించేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రభావంతో జిల్లా అధికారులు ఆదివారం నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షణ పెడుతున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలు, బస్టాండ్లు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మెదక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7331186780, జిల్లా కేంద్ర దవాఖాన నంబర్‌ 08452-221271లో ఏదైనా సమాచారం కోసం సంప్రదించాలన్నారు.

జిల్లాలో కరోనా భయం లేదు..

జిల్లాలో కరోనా వైరస్‌ భయం లేదని, ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 35 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా కరోనా వైరస్‌ సోకే అవకాశాలు తక్కువ. తెలంగాణలో కరోనా ప్రభావం లేదని, ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్తగా 15 రోజుల పాటు జిల్లాలో విద్యాసంస్థలను, సినిమాహాళ్లను, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చేంతవరకు జిల్లాలో బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాపులు, ఉత్సవాలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి లేదు. 

31వరకు మూతపడనున్న స్కూళ్లు...

కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. మెదక్‌ జిల్లాలోని 145 హై స్కూళ్లు, 7 మోడల్‌ స్కూళ్లు, 15 కేజీబీవీ స్కూళ్లు, 623 ప్రైమరీ స్కూళ్లు, 131 యూపీఎస్‌ స్కూళ్లు, 158 ప్రైవేట్‌ స్కూళ్లు మూతపడనున్నాయి. వేసవి ఆరంభంలోనే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఆనందంగా ఉన్నప్పటికీ కరోనా భయం మాత్రం వారి తల్లిదండ్రులను వెంటాడుతూనే ఉన్నది. పిల్లలు, పెద్దలు ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇదిలావుండగా జిల్లాలోని మెదక్‌, తూప్రాన్‌, రామాయంపేట, నర్సాపూర్‌ పట్టణాల్లో సినిమా థియేటర్లను కూడా మూసివేయనున్నారు. అంతేకాకుండా పట్టణాల్లో ఉన్న షాపింగ్‌ మాల్స్‌ మూతపడనున్నాయి. కరోనా వైరస్‌ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 

పది, ఇంటర్‌ పరీక్షలు యథాతథం...

ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. అయితే ఇంటర్మీడియట్‌తో పాటు పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి. 

పెద్దశంకరంపేటలో..

పెద్దశంకరంపేట : కరోనావైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆదివారం పెద్దశంకరంపేటలో లక్ష్మి సినిమా టాకీస్‌ మూసివేశారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు రావడంతో ఈనెల 31 వరకు సినిమా టాకీస్‌ మూసివేస్తున్నట్లు యాజమన్యం తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు కూడా ఈనెల 31 వరకు మూసివేయాలని ఆదేశించడంతో విద్యార్థులు ఇంటిముఖం పట్టారు.


logo
>>>>>>