ఆదివారం 29 మార్చి 2020
Medak - Mar 16, 2020 , 00:29:33

జలనిధి

జలనిధి

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా వాగులపై చెక్‌ డ్యాంలను నిర్మిస్తున్నది. మెతుకుసీమలో ఆయకట్టు సాగును పెంచేందుకు మంజీరా, హల్దీ వాగులపై 15 చెక్‌ డ్యాంల నిర్మాణానికి రూ.108 కోట్ల 20లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మరో 7 చెక్‌డ్యాంల నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి రూ.44.60 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే 6 చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తికాగా మిగతా చెక్‌డ్యాంల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ చెక్‌ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరుగడంతోపాటు జిల్లాలో 22,532 ఎకరాలకు సాగునీరు అందనున్నదని అధికారుల అంచనా. హవేళిఘనపూర్‌ మండలం కూచన్‌పల్లి , కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామాల్లో నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు పూర్తికాగా, దామరంచ, ఉప్పులింగాపూర్‌, మానేపల్లి, కుకునూర్‌, వెల్దుర్తి, యవాపూర్‌లలో చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తికావస్తున్నాయి. చెక్‌డ్యాం నిర్మాణాలతో సాగునీటి కష్టాలు తీరుతున్నాయని జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • మంజీరా, హల్దీ వాగులపై 15 చెక్‌డ్యాంల నిర్మాణం
  • ప్రభుత్వ నిధులు రూ.108కోట్ల 20లక్షలు మంజూరు
  • మరో సంవత్సరంలో పూర్తికానున్న చెక్‌డ్యాంల నిర్మాణాలు
  • భూగర్భ జలాల పెంపు, పరిసర ప్రాంతాల్లోని భూములకు సాగునీరు
  • రూ.44.60కోట్లతో మరో 7 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రతిపాదనలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వ్యవసాయ ఆధారిత జిల్లాగా పెరుగాంచిన మెతుకుసీమలో భూగర్భ జలాలను పెంచి ఆయకట్టు సాగుతో రెతన్నలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టింది. ముఖ్యంగా వాగులకు వచ్చే వర్షపునీటిని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. వాగులపై చెక్‌ డ్యాంలను నిర్మించి వాటి నుంచి సాగునీరందించి ఆయకట్టును పెంచాలన్నదే ప్రభుత్వ  ఉద్దేశం. ముఖ్యంగా జిల్లాలోని మంజీరా, హల్దీ వాగులతోపాటు వర్షపు నీరు వృథాగాపోకుండా ఉండటానికి ఎక్కడికక్కడ ఇరిగేషన్‌ అధికారులు , ప్రత్యేక ఏజెన్సీలతో సర్వే చేసి నీటి నిల్వ చేసే ప్రాంతాలను ఎంపిక చేసి రైతులకు ఉపయోగపడేలా అక్కడ చెక్‌ డ్యాంలను  నిర్మిస్తున్నారు. జిల్లాలో రూ.108 కోట్ల 20లక్షలతో 15 చెక్‌డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొద్ది పాటి వర్షానికే కాల్వల నుంచి వాగులు , వంకలు నీటితో నిండే చోటనే చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాకుండా హల్దీ, మంజీరా పరీవాహక ప్రాంతంలో మంజీరా నది, హల్దీ వాగులలో 13 చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. మరోమూడు చెక్‌డ్యాంలను చిలిపిచెడ్‌ మండలం పైదాబాద్‌, చిట్కుల్‌ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే ఆరు చెక్‌ డ్యాంల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. హవేళిఘనపూర్‌ మండలం  కూచన్‌పల్లి , కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు పూర్తయ్యాయి. మరో 4 చెక్‌డ్యాంలు దామరంచ, ఉప్పులింగాపూర్‌, మానేపల్లి, కుకునూర్‌, వెల్దుర్తి, యవాపూర్‌లలో చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తికావస్తున్నది. కూచన్‌పల్లి గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం మంజీరా నది పరీవాహక ప్రాంతంలోని 8 గ్రామాల రైతులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతి చెక్‌డ్యాం రైతులకు ఉపయోగపడే విధంగా నీటి పారుదల అధికారులు డిజైన్‌ చేశారు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ మల్లయ్య నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య ఆధ్వర్యంలో చెక్‌ డ్యాంలు నిర్మించే స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందుకనుగుణంగానే చెక్‌ డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో చెక్‌డ్యాంలకు నిధులు మంజూరయ్యాయి. ఎన్నికలకు ముందు నర్సాపూర్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకనుగుణంగా చెక్‌డ్యాంలకు నిధులు మంజూరయ్యాయి. అంతేకాకుండా  జిల్లా మొత్తంగా 15 చెక్‌డ్యాంలకుగాను రూ.108 కోట్ల 20లక్షలను  ప్రభుత్వం మంజారు చేసింది. మరో  7 చెక్‌డ్యాంల నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వడంతో వీటికి కూడా నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి పరిసర భూములకు సాగునీటితో పాటు పశుపక్షాదుల దాహార్తి తీరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. స్థానికంగా ఉన్న వాగులకు వచ్చే వర్షపు, వరద నీటిని వృథాగా పోనివ్వకుండా పరిసర రైతులకు ప్రయోజనకరంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆరు చెక్‌డ్యాంలు పూర్తికావచ్చాయి. గత వర్షకాలంలోనే కూచన్‌పల్లి, ఎనగండ్ల, దామరంచ చెక్‌డ్యాంలు 15 నుంచి 20 గ్రామాల రైతులకు సాగునీటిని అందించాయి. జిల్లాకు మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే జిల్లాలో 22,532 ఎకరాలకు సాగునీరు అందుతుందని నీటి పారుదల శాఖ అధికారుల అంచనాలు వేశారు. మరో 7 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రతిపాదనల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ అధికారులు  రూ.44.60 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. 

6 చెక్‌డ్యాం నిర్మాణాలు పూర్తి

మంజీర, హల్దీ నదులతో పాటు ఇతర వాగులపై 108.20లక్షలతో 15 చెక్‌డ్యాంల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. మంజీర, హల్దీ నదులపై 13 చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నాం. చిలిప్‌చెడ్‌, ఫైజాబాద్‌, సర్ధనల గ్రామాలకు చెక్‌డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మరో 7 చెక్‌డ్యాం నిర్మాణానికి 44.60కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో ఈ చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నది. 6 చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తికాగా మిగతా చెక్‌డ్యాంల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ చెక్‌డ్యాంల భూగర్భ జలాల పెంపుతో పాటు 22వేల వరకు  ఆయకట్టుకు నీరందిస్తాయి. 

- నీటిపారుదల శాఖ ఈఈ ఏసయ్య 

పెరిగిన భూగర్భజలాలు..

మండలంలోని హక్కీంపేట వద్ద హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో భూగర్భజలాలు పెరిగాయి. వర్షాలు కురిసినప్పుడు  నీరు ఎక్కడికక్కడ నిలువడంతో పాటు కిందికి వెళ్లే ప్రవాహానికి అడ్డుకట్టు పడుతుంది. 

- గోపాలరావు, రైతు వెల్దుర్తి

తీరనున్న సాగు, తాగునీటి కష్టాలు..

హల్దీవాగు వెంబడి ఉన్న వ్యవసాయ పొలాలతో పాటు గ్రామాలకు తాగునీటిని  సరఫరా చేస్తున్నారు. వాగు ప్రవహించినప్పుడు నీరు చెక్‌డ్యాంలో నిలిచి పోతుంది.  

 - ఆంజనేయులు, ఉప్పులింగాపూర్‌ 

సాగుకు పుష్కలంగా నీళ్లు..

హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో వాగులో నీళ్లు నిలబడుతున్నాయి.  సాగుకు పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.   

 - కర్రోళ్ల రాములు, దామరంచ 

మండలం సస్యశ్యామలం 

హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలో నెలల పాటు నీరు నిలిచి ఉంటుంది.  ‘కాళేశ్వరం’ జలాలు వాగులో ప్రవహిస్తే హవేళిఘనపూర్‌ మండలం సస్యశ్యామలం కానున్నది.          

- అడివయ్య, వెల్దుర్తి

రైతులకు అండగా...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తూ చెక్‌డ్యాంల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నది. 

-  నరేందర్‌రెడ్డి, రాయిన్‌చెర్వు

భూగర్భ జలాలు వృద్ధి..  

వర్షాకాలంలో వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పుష్కలంగా సాగునీరు అందనుండటం ఆనందంగా ఉన్నది.

- శ్రీకాంత్‌, హవేళిఘనపూర్‌

రైతు రాజ్యంగా ... 

రాష్ర్టాన్ని రైతు రాజ్యంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. ప్రాజెక్టుల నిర్మాణంతో బీడు భూములు పచ్చగా కళకళలాడనున్నాయి.  రాబోయే రోజుల్లో ఒక్క గుంట కూడా బీడు ఉండకుండా సీఎం కృషి చేస్తున్నారు.

- కసిరెడ్డి మాణిక్యరెడ్డి, తొగిట

చెక్‌డ్యాంలతో ఎంతో మేలు..

మండల పరిధిలోని కూచన్‌పల్లి శివారులో చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి అవకాశం లభిస్తుండటం ఆనందంగా ఉన్నది.  

- కిష్టాగౌడ్‌, కూచన్‌పల్లి


logo