ఆదివారం 29 మార్చి 2020
Medak - Mar 08, 2020 , 00:22:52

ఆమె జీవన ‘రేఖ’

ఆమె జీవన ‘రేఖ’

దుబ్బాక, నమస్తే తెలంగాణ : మహిళలు మానసిక లోపాన్ని అధిగమిస్తే.. సాధించలేనిదంటూ ఏమి ఉండదని దుబ్బాక ఎంపీడీవో కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ కూరపాటి రేఖ అక్షరాల నిజం చేశారు. లక్ష్యానికి సంకల్పం ఉంటే చాలని మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. పట్టణానికి చెందిన కూరపాటి రేఖ అంధురాలిపై ప్రత్యేక కథనం.. రేఖ నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టారు. కూరపాటి సులోచన నర్సప్ప దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు పిల్లలు అంధులు. మూడో సంతానమైన రేఖకు ఎనిమిది ఏండ్ల వయస్సు వచ్చే వరకు అందరిలా కండ్లు కనిపించాయి. అనంతరం కొద్దికొద్దిగా చూపు మందగించింది. పదేండ్ల వయస్సులో ఆమె చూపు పూర్తిగా కోల్పోయారు. వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. దీంతో చూపు లేని ఆడపిల్లను చదివించటం తల్లిదండ్రులు మొదట ఇబ్బంది పడ్డారు. రేఖ చదువుకోవాలన్న పట్టుదలను గుర్తించిన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో.. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌లో బ్రెయిలీ లిపి ద్వారా పై చదువులు చదివించారు. 


నిరుత్సాహ పడలేదు..

రేఖ ఏనాడు కండ్లు లేవని నిరుత్సాహ పడలేదు. కండ్లులేవని జాలి చూపించవద్దంటూ కోరేది. ఆమె కష్టం వృథా పోలేదు. పదిహేనేండ్ల కిందట రేఖ తన ప్రతిభ పాటవాలతో ప్రభుత్వ ఉద్యోగం(జూనియర్‌ అసిస్టెంట్‌) సాధించారు. కళాశాలలో పరిచయమైన తోటి విద్యార్థి (అంధుడు) రామకృష్ణను వివాహం చేసుకున్నారు. ఆయన సిద్దిపేట ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తున్నారు. వారికి కండ్లు లేకున్నా సమాజంలో ఉత్తమంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  


మానసిక లోపాన్ని జయించాలి- రేఖ

సమాజంలో స్త్రీ, పురుషులు ఎవరికీ వారే అసమానతలు సృష్టించుకుంటున్నారు. శారీరక లోపం కంటే మానసిక లోపం భయంకరమైంది. మహిళలు మానసికంగా ధృడంగా ఉంటేనే ఏదైనా చేయగలరు. నేడు పురుషులతో పోటాపోటీగా అన్ని రంగాల్లో   ముందుంటున్నారు. రాజకీయ, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మహిళలు ముందుండటం గర్వకారణం. ఆడపిల్లలకు స్వేచ్ఛ కల్పిస్తేనే.. తాము ఎంచుకున్న రంగాల్లో  రాణిస్తారు. బాలికలు, మహిళలపై దాడులు జరుగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలి.  మహిళలకు పూర్తి స్వేచ్ఛ కల్పించేందుకు ప్రభుత్వంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. 


logo