సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 07, 2020 , 06:39:05

‘కాళేశ్వరం’తో పంటలకు సాగునీరు

‘కాళేశ్వరం’తో పంటలకు సాగునీరు
  • మెదక్‌ నియోజకవర్గంలో లక్షా పదివేల ఎకరాలకు సాగునీరు
  • కొంటూర్‌ చెరువుకు కొండపోచమ్మ సాగర్‌నీరు
  • కొంటూర్‌...కొర్విపల్లి డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ను అధికారుల బృందంతో పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేంవేందర్‌రెడ్డి
  • బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్‌

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్‌ నియోజకవర్గానికి లక్షా పదివేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్‌ జిల్లా అధికారి ఏసయ్య కొండపోచమ్మ సాగర్‌ ఏజెన్సీ అధికారులు మధుసూదన్‌రెడ్డి, శ్రీహరిలతో కలసి కొండపోచమ్మ సాగర్‌ ద్వారా మెదక్‌ కొంటూర్‌ చెరువుకు వచ్చే కెనాల్‌ పనులు, చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద ఉన్న మొదటి డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు రైతన్నలకు వరప్రదాయని అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని నిజాంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, పాపన్నపేట, మెదక్‌ మండలాలు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌ ద్వారా మెదక్‌ మండలంలోని కొంటూర్‌ పెద్ద చెరువును నింపి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయకట్టు పరిధిలోని 4వేల 200 ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్‌ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. హల్దీ, మంజీరా నదులకు కాళేశ్వరం నీటిని సరఫరా చేసి మొత్తం హల్దీ, మంజీరా పరివాహక ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి సర్వే ఏజెన్సీలు తమ పనిని పూర్తి చేశాయని పేర్కొన్నారు. కొంటూరు చెరువుకు మళ్లించే కెనాల్‌ను 1400 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తూ చెరువును నింపుతుందని వివరించారు.


కిలోమీటరు నడుచుకుంటూ.. 

అధికారులతో కలసి కిలోమీటరు దూరంలో ఉన్న కెనాల్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైన్‌ సర్వే పనులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ఏజెన్సీ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు, మ్యాపు ద్వారా కెనాల్‌ మార్గాలను ఆయా చెరువులకు అందించే నీటి సామర్థ్యాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. 400మీటర్ల అటవీ భూమి కెనాల్‌ పనులకు అవసరం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించుకొని ముందుకెళ్దామని, త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొంటూర్‌ పరిధిలోని 12 నుంచి14 గ్రామాలకు సాగునీరు అందనున్నదన్నారు. గుట్టకిందిపల్లి లాంటి పల్లెలకు సైతం కెనాల్‌ ద్వారా సాగు నీరు అందించనున్నామన్నారు. ఈ పనులు సంవత్సరంన్నరలో పూర్తి కానున్నాయన్నారు. ఆమె వెంట జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, హవేళిఘనపూర్‌ జెడ్పీటీసీ సుజాత శ్రీనివాస్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, కొంపల్లి సుభాశ్‌రెడ్డి, రాగి అశోక్‌, గంగాధర్‌, లింగారెడ్డి, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.


logo