మంగళవారం 31 మార్చి 2020
Medak - Mar 07, 2020 , 06:26:04

‘సాధిస్తే విజయం.. లేకుంటే పాఠం’ బద్ధ్దకం

‘సాధిస్తే విజయం.. లేకుంటే పాఠం’ బద్ధ్దకం
  • విశ్రాంతిల మధ్య తేడా గుర్తిద్దాం

సాధారణంగా మానవుడి జీవితంలో అనేక ఆందోళనలకూ, అనర్థాలకూ కారణం బద్ధకం.. ఈ సంగతి మనకూ తెలుసు. ఆ మాటకొస్తే మన విజయానికి అడ్డంకులుగా ఉన్న పది కారణాల్లో మొదటి 3 స్థానాల్లో బద్ధకం తప్పనిసరిగా ఉంటుంది.. అయితే దాన్ని గుర్తించడం ఎలా.. వదుల్చుకోవడం ఎలా.. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.


 గజ్వేల్‌ టౌన్‌: ‘బద్ధ్దకం అంటే.. నువ్వు అలసిపోకముందే విశ్రాంతి కోరుకోవడం’ అనేది దీనికి ఉన్న నిర్వచనాల్లో ఒకటి. మీరు నివసించే గదిలో, ఆఫీసులో బల్ల మీద గుట్టలు గుట్టలుగా అనవసర వస్తువులు పేరుకోవడం బద్ధకానికి బండ గుర్తు. ‘ఎప్పుడూ నేనే చెయ్యాలా?’, ‘అన్నీ నేనే చెయ్యాలా?’, ‘నేను చెయ్యలేను’, ‘నా వల్ల కాదు’, ‘ఇప్పుడు చెయ్యకపోతే ఏమవుతుంది?’, ‘మానేస్తే లేదా ఆలస్యమైతే కొంపలు మునుగుతాయా?’ ఇవన్నీ బద్ధకాన్ని ప్రకటించే మాటలే. చిన్న చిన్న కారణాలతో ప్రారంభమయ్యే పని వాయిదాలతో మొదలైన బద్దకం నిదానంగా ఆత్మవిశ్వాస లోపానికి, అసహనానికి, ప్రతికూల భావనలకి దారితీస్తున్నది. ఈ మాటల జాబితా గమనిస్తే మనకి ఆ సంగతి అర్థమవుతుంది.


బద్ధకం రకాలు..

 వాయిదాలు వేసేది సాధారణ బద్ధకం..: విశ్రాంతి నుంచి బయటకు రావడానికి శరీరం, మనసూ ఇష్టపడకపోవడం. ‘ఏ పని చెయ్యబుద్ది కావడం లేదు..’ అనే స్థితి. సరైన ఉత్తేజపరిచే లక్ష్యాలు లేకపోవడం దీనికి కారణం. మనకు బాగా ఆసక్తి ఉత్సాహం కలిగించే పని లేదా లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని గుర్తు చేసుకుంటే ఈ తరహా లోపం నుంచి బయటకు రావచ్చు.

 అపనమ్మకం వల్ల వచ్చేది.. : ‘నేను చెయ్యలేను’, ‘నా వల్ల కాదు’ అనుకొని చేయాల్సిన పని మానేయడం. ఏ పని పూర్తిగా చేయకపోవడం వల్ల ఏ పనికి పూర్తి ఫలితాన్ని పొందలేం. అపజయం వల్ల అపనమ్మకం, అపనమ్మకం వల్ల అపజయం, ఈ రెండింటికీ అంతస్సూత్రంగా బద్ధకం ఇదొక విషవలయం. ‘చేసి చూద్దాం.. కొద్ది నిమిషాలు, కొన్నిసార్లు చిన్న చిన్న లక్ష్యాలతో ఫలితం ఆశించకుండా ప్రయత్నం చేయడం అలవాటు చేసుకోవాలి. ‘సాధిస్తే విజయం, లేకుంటే పాఠం’ అనుకోవాలి.


ప్రతికూల భావనలతో వచ్చేది.. :  ‘చెయ్యకపోతే కొంపలు మునగవు’ ‘ఈ ఒక్కసారికి ఎలాగోలా తప్పించుకుంటే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు’ అనే ఆలోచనలతో పని వాయిదా వేయడం  వర్గానికి చెందుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. పనిచేసే అలవాటు తప్పిపోతోందనడానికి గుర్తు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. మనకు పని మీద ఉత్సాహం తగ్గడానికి కారణాలేమిటో తక్షణం సమీక్షించుకోవాలి. ఆత్మీయులు, నిపుణుల సహాయం తీసుకోవాలి. ప్రతిరోజు మనకు ఎదురయ్యే బద్దకాలు కేవలం ఒక వర్గానికి చెంది ఉండాలని లేదు. రెండు మూడు వర్గాల సమ్మేళనంగా ఉండొచ్చు.


 బద్ధకం వదిలించుకునేందుకు చిట్కాలు.. 


బద్ధకం నుంచి బయటపడేందుకు 

ఈసూత్రాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

1. బద్ధకం సహజమని గుర్తించండి. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం, నిందించుకోవడం మాని లోపాన్ని వదిలంచుకొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండండి.

2. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి.. తక్షణం పూర్తి చేయండి..

3. అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం అన్నిటికన్నా ముందు         

4. పనికి పనికీ మధ్య చిన్న చిన్న విరాలాలిచ్చుకోండి.

5. పక్కదోవ పట్టించే మొబైల్‌, ఇంటర్‌నెట్‌, టీవీ తదితర ఆకర్శణలను తాత్కాలికంగానైనా మూసివేయండి.

6. లక్ష్యాల జాబితాను స్పష్టంగా రాసుకోండి.

7. లక్ష్యాల ప్రయోజనాలను, నష్టాలను రాసుకోండి.

8. ఒకసారి ఒక పనే చేయండి.

9. చిన్న చిన్న వైఫల్యాలకు సిద్ధం కండి.

10. కుతూహలాన్నీ, జిజ్ఞాసనూ పెంచుకోండి.


కొసమెరుపు..

బద్ధకస్తులు పని వేగంగా చేసేందుకు మార్గాలను కనిపెడుతారంటారు బిల్‌గేట్స్‌. పైకి అది నిజమే అనిపించినా అది లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉన్నవారికి మాత్రమే అని గుర్తించాలి. విశ్రాంతికీ.. బద్దకానికీ.. తేడా గుర్తించడంలోనే విజయ రహస్యం ఉన్నది. విశ్రాంతి పనిపై ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచితే, బద్ధకం పనిపై మరింత నిరాసక్తత కలిగిస్తున్నది. అదే బద్ధకానికి, విశ్రాంతికి మధ్య తేడా గుర్తించడానికి బండ గుర్తు. 


logo
>>>>>>