మంగళవారం 31 మార్చి 2020
Medak - Mar 06, 2020 , 00:40:00

‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి

‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి

మెదక్‌, నమస్తే తెలంగాణ :ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను మండలాలకు సంబంధించిన ఉపాధిహామీ పనుల లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో కలెక్టర్‌ సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధిహామీ కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నెలాఖరులోగా పూర్తి చేసేందుకు గాను అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉపాధిహామీ కార్యక్రమం ద్వారా చేపట్టేందుకు గాను అవకాశం ఉన్న పనులను గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో వ్యవసాయం మొత్తం చెరువులు, కుంటల మీద ఆధారపడి సాగుతున్నదని చెరువుల్లోకి నీరు వెళ్లే ఫీడర్‌ చానల్‌ కాల్వలను పునరుద్ధరించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాల స్వరూపాన్ని మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో పశువులు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా ఉండేందుకు గాను గ్రామాల్లో ఉన్న పశువుల నీటి తొట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  గ్రామాల్లో ఉపాధిహామీ పనులకు సంబంధించిన బిల్లులు మొత్తం ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలన్నారు. 


హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొక్కల సంరక్షణకు గాను, తడి, పొడి చెత్త సేకరణకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను అందజేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరించేందుకు గాను ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గ్రామంలోని పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులకు తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం ఎలా వర్మీకంపోస్టుతో ఎరువును తయారు చేయడంపై కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న శాస్త్రవేత్తలు పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీబాయి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉమాదేవి, డీపీవో హనోక్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారులు జ్యోతి, వరలక్ష్మి, రమణమూర్తితో పాటు ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>