శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 05, 2020 , 00:42:22

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్థానికంగానే వైద్య పరీక్షల నిర్వహణకు నడుంబిగించింది. ఇందుకోసం ప్రభుత్వ దవాఖానల్లో డయాగ్నోస్టిక్‌ హబ్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ జాబితాలో మెదక్‌ ఏరియా దవాఖాన సైతం ఉండడం స్థానికులకు ఊరట కలిగించే పరిణామం.. రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి డయాగ్నోస్టిక్‌ హబ్‌ను ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలకు సైతం ఈ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మెదక్‌లో నెలకొల్పిన డయాగ్నోస్టిక్‌ హబ్‌ పేదలకు వరంగా మారనున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమకు దగ్గర్లో ఉన్న దవాఖానలో చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షల శాంపిళ్లను ఈ డయాగ్నోస్టిక్‌ హబ్‌కు పంపించనున్నారు. ఈ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా సేకరించిన శాంపిళ్ల ఫలితాలను సత్వరమే అందించనున్నారు.


స్థానికంగానే సకల పరీక్షలు

ప్రస్తుతం మెదక్‌ ఏరియా దవాఖానలో ఏర్పాటైన డయాగ్నోస్టిక్‌ హబ్‌లో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా వీడీఆర్‌ఎల్‌, హెమటాలజీ, బ్లడ్‌ గ్రూపింగ్‌, ప్లేట్‌లెట్స్‌, హార్మోన్‌ స్టడీస్‌, మేజర్‌, మైనర్‌ సర్జికల్‌ ప్రొఫైల్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఐజీ, హెచ్‌సీవీ, విటమిన్‌ బీ 12, డీ విటమన్‌, షుగర్‌, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, థైరాయిడ్‌, ఫీవర్‌, టీబీ, క్యాల్షియం వంటి అనేక పరీక్షలను నిర్వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క మ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరి యా దవాఖానను అనుసంధాని స్తూ ఈ డయాగ్నోస్టిక్‌ హబ్‌ను ఏ ర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని పూ ర్తిస్థాయిలో అందుబాటులోకి తె చ్చేందుకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.


పేదలకు లబ్ధి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా పేద  లకు లబ్ధిచేకూరనున్నది. రోజూ 1000 మంది రోగులు మెదక్‌ ఏరియా దవాఖానకు వస్తుంటారు. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా..పేదలకు మెదక్‌ ఏరియా దవాఖానే దిక్కు. అయితే ఇక్కడ వ్యాధి నిర్ధారణ ఎక్విప్‌మెంట్‌ లేకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌ సిఫారసు చేస్తున్నారు. దీంతో రోగుల జేబు గుల్ల అవుతున్నది. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానల్లో టెస్టుల ఖర్చు తడిసిమోపెడవుతున్నది. చివరకు టెస్టుల్లో సంబంధిత వ్యాధి రిపోర్టు నెగెటివ్‌గా వస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ సమయంలో రోగుల డబ్బు వృథాగా మారుతున్నది. వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటుతో ఈ బాధ తప్పనున్నది. ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేయించుకునే సౌకర్యం కలుగనున్నది.


వేగంగా వ్యాధి నిర్ధారణ.. సత్వర ఫలితాలు

మెదక్‌ ఏరియా దవాఖానలో డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటుతో అత్యవసర సందర్భాల్లో అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ప్రాణాపాయస్థితి నుంచి రోగిని కాపాడవచ్చు. వేగంగా వ్యాధి నిర్ధారణ కావడం వల్ల సత్వరమే చికిత్స ప్రారంభించవచ్చు. క్షతగాత్రులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులను హైదరాబాద్‌ రెఫర్‌ చేయడం ద్వారా మార్గమధ్యంలోనే అనేక మరణాలు సంభవించిన ఘటనలున్నాయి. ప్రస్తుతం గవర్నమెంట్‌ దవాఖానలోనే అన్ని వసతులు, ఎక్విప్‌మెంట్‌తో కూడిన డయాగ్నోస్టిక్‌ హబ్‌ వల్ల అత్యవసర కేసులను అడ్మిట్‌ చేసుకొనే అవకాశముంది.


తెలంగాణ విధానాలపై కేంద్రం అధ్యయనం

తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. తెలంగాణ సలహాలు, సూచనలతో మెరుగైన పద్ధతులను కేంద్రం అనుసరించనున్నది. ప్రధానంగా బోధన వైద్యశాలల్లో అడ్వాన్స్‌డ్‌ డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరుపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నది. పలు రాష్ర్టాలు సైతం తెలంగాణను అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.


త్వరలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు

మెదక్‌ ఏరియా దవాఖానలో పూ ర్తిస్థాయిలో అన్నిరకాల వైద్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డయాగ్నోస్టిక్‌ హబ్‌ల జాబితాలో మెదక్‌ ఏరియా దవాఖాన ఉన్నది. స్థానికంగా వైద్య పరీక్షలు అందడం వల్ల జిల్లా వాసులకు మేలు చేకూరనున్నది. దూర ప్రాంతాలకు వెళ్లే ఇక్కట్లు తప్పుతాయి. 

- చంద్రశేఖర్‌, మెదక్‌ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌


logo