బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Mar 04, 2020 , 01:25:43

ఆలస్యం విషం

ఆలస్యం విషం

మెదక్‌, నమస్తే తెలంగాణ / మెదక్‌ రూరల్‌ : జిల్లాలో నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,598 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉన్నది. ఉదయం 8.45 గంటలలోపే విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి రావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదు అని అధికారులు చెబుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్‌, ఫ్లైయింగ్‌ స్కాడ్లు విధులు నిర్వహించ న్నారు. జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలకు 15,598 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 7700 మంది, ద్వితీయ సంవత్సరం 6039 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 707 మంది, ద్వితీయ సంవత్సరం 502 మంది విద్యార్థులు ఉన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు 33 మంది, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు 33 మంది, ఇన్విజిలేటర్లు 600 మంది, ముగ్గురు సిట్టింగ్‌ స్కాడ్లు, ఇద్దరు ఫ్లైయింగ్‌ స్కాడ్లు విధులు నిర్వహించనున్నారు. 

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..

అరగంట ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షలు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.  సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్ష హాల్‌లోకి అనుమతి లేదు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయాలని అధికారులు సంబంధిత దుకాణాదారులకు ఆదేశించారు. 

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

హాల్‌టికెట్లు అందని విద్యార్థులు www.tsbie. cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంతేకాకుండా స్మార్ట్‌ ఫోన్లలో http://play. google.come/store/apps/detailas లోకి వెళ్తే జిల్లాల వారీగా యాప్‌ వివరాలు తెలియజేస్తుంది.

పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ప్రత్యేక లొకేషన్‌ యాప్‌..

పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు ఎక్కడో తెలుసుకునేందుకు వీలుగా ఇంటర్‌బోర్డు రెండు సంవత్సరాల నుంచి ‘సెంటర్‌ లొకేటర్‌' పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది..  ఎంత దూరంలో ఉన్నది.. అనే వివరంగా తెలుపుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా bigrs.telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటును కల్పించింది.  


logo