బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Mar 04, 2020 , 01:16:01

ఆశలు సమాధి చేస్తూ..

ఆశలు సమాధి చేస్తూ..

రాత్రి 8 గంటల సయమం.. షిప్ట్‌ మారేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు... ఉన్నట్టుండి భారీ శబ్ధం.. పరిశ్రమలోని ఈవోటీ క్రేన్‌, బంకర్‌ కుప్పకూలాయి.. కార్మికులు, పర్రిశమ సిబ్బంది తేరుకునే లోపే ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. బంకర్‌ వద్ద ఉన్న లారీని ఇనుము ముడి సరుకు కప్పేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్‌ కట్టర్‌, డోజర్‌ సాయంతో ముడి సరుకును తొలగిస్తుండగా లారీలో ఓ మృతదేహం, ముడిసరుకులో మరో మృత దేహం బయట పడ్డాయి. క్షణాల వ్యవధిలోనే ఇరువురు మృత్యుఒడికి చేరడంతో పరిశ్రమలోని కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  

మనోహరాబాద్‌ : ఈవోటీ క్రేన్‌, బంకర్‌ కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన చిర్రగోన సుమన్‌ (24) ఇనుము ముడి సరుకు లోడుతో మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులోని మహాలక్ష్మి ప్రొఫైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు సోమవారం రాత్రి చేరుకున్నాడు. లారీలోని సరుకును దిగుమతి చేసేందుకు పరిశ్రమలోని బంకర్‌ వద్ద లారీని నిలిపాడు. అదే పరిశ్రమలో పని చేస్తున్న మహేశ్‌యాదవ్‌ (26) కిందపడిపోయిన ముడిసరుకును చీపురుతో ఒక్కచోటకు చేర్చుతున్నాడు. ఇదిలా ఉండగా పరిశ్రమ సిబ్బంది ఇనుము ముడి సరుకును ఈవోటీ క్రేన్‌ (అయస్కాంతశక్తితో ఇనుమును ఆకర్షించి, బంకర్‌లోకి వదిలే పరికరం)తో లారీలో నుంచి బంకర్‌లోకి అన్‌లోడు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవోటీ క్రేన్‌ విరిగి బంకర్‌పై పడింది. దీంతో ఓవర్‌ వెయిట్‌కు గురై ముడిసరుకుతో సహా లారీపై బంకర్‌ పడికప్పుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న సుమన్‌, కింద ముడిసరుకును ఊడ్చుతున్న మహేశ్‌యాదవ్‌లు   మృతి చెందారు. ఈవోటీ క్రేన్‌ను నడుపుతున్న  శివనరేశ్‌, హెల్పర్‌ విమల్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మేడ్చల్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ముడిసరుకు కింద ఇరుక్కుపోయిన సుమన్‌, మహేశ్‌యాదవ్‌ల మృతదేహాలను మంగళవారం తెల్లవారుజాము వరకు సుమారు నాలుగైదు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. ఇనుముముడి సరుకు కుప్పలో లారీ నుజ్జునుజ్జు అయ్యింది. సంఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ప్రమాదపు వివరాలను సేకరించారు. అక్కడికి చేరుకున్న మృతుడు సుమన్‌ బంధువులు పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని పరిశ్రమ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపారు.  


logo
>>>>>>