గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 03, 2020 , 05:24:28

రైతు బంధువు

రైతు బంధువు
  • రైతన్నల ఖాతాల్లోకి యాసంగి పంట పెట్టుబడి
  • ఇప్పటికే 1,59,408 మందికి అందిన సాయం
  • ఇంకా 12,663 రైతులకు చేకూరనున్న లబ్ధి
  • పెట్టుబడి చేతికి రావడంతో రైతుల ఆనందం

ఒక్కొక్క పథకం. ఒక్కొక్క ఫలితం... రైతన్న చిరునవ్వుకు కారణమవుతున్నాయి. దేశం మొత్తంలో తెలంగాణలోనే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్న విషయం విదితమే.. ‘మిషన్‌ కాకతీయ’తో చెరువులు బాగుపడి భూగర్భజలాలు భారీగా పెరుగగా, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  దీంతోపాటు  రైతులకు అవసరమైన యూరియా తదితరాలు అందుబాటులో ఉంచారు.   ప్రస్తుత యాసంగి సీజన్‌ కోసం 1,72,071 మంది రైతులకు అర్హత ఉండగా , ఇప్పటి వరకు1,59,408 మంది రైతులకు రూ.127,08,60,336 పంట పెట్టుబడి సాయం అందింది. మిగతా  వారి ఖాతాల్లో తొందరలోనే ఈ మొత్తం జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతు బంధు పథకంతో సీఎం కేసీఆర్‌ రైతుబంధువు అయ్యాడంటూ అన్నదాతలు ఆశీర్వదిస్తున్నారు.

- మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతన్నలు అప్పులపాలు కావొద్దని సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకం దేశానికే స్ఫూర్తినిచ్చింది. పలు రాష్ర్టాల్లో ఇదే తరహాలో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా,  కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రవేశపెట్టి అన్నదాతలకు ఆర్థికంగా సాయమందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదట 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేల సాయాన్ని అందించిన తెలంగాణ సర్కారు పెట్టుబడి సాయాన్ని పెంచింది. ఎకరానికి రూ.వెయ్యి పెంచడంతో రెండు విడుతల్లో రూ.10వేల సాయం అందనున్నది. ఈ యాసంగి  సాయం ఇప్పటికే రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ కాగా, జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  


సాయం రూ.10వేలకు పెంపు

రెండు విడుతలకు కలిపి రూ.8వేలు అందించే సాయాన్ని సీఎం కేసీఆర్‌ రూ.10వేలకు పెంచారు. వానకాలం సాగుకు రూ.5వేలు, యాసంగి సాగుకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా గడిచిన వానకాలం సీజన్‌ పెట్టుబడి సాయం రైతులకు అందుతున్నది. మొదటి విడుత రూ. 5వేలు పొందిన రైతులు... ప్రస్తుతం యాసంగి సీజన్‌ రెండో విడుత సాయం రూ.5వేలనూ అందుకుంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ‘రైతు బంధు’ పథకం నుంచి జిల్లాలోని 1,72,071 మంది రైతులకు అర్హత ఉందని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వీరికి రూ.161,11,92,235 పెట్టుబడి సాయాన్ని అందజేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు రైతుల పేర్లకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీంతో ఇప్పటి వరకు 1,59,408 మంది రైతులకు రూ.127,08,60,336 పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. మిగిలిన 12,663 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా కొద్ది రోజుల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో  డబ్బులు జమవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాంనాయక్‌ వెల్లడించారు. రైతుల జాబితాను  దశలవారీగా ట్రెజరికి పంపుతున్నామని, అర్హులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు.  


లాగోడికి రందీ లేదు... 

‘రైతు బంధు’ సాయం అందుతుండటంతో లాగోడికి రందీ లేకుండా పోయింది. అప్పు చేయకుండా సాగు చేస్తున్నా. రెండు ఎకరాల భూమికి రూ.10వేలు వచ్చినయ్‌. ఇదివరకు ఎవుసం పెట్టుబడికి, కూళ్లకు లెక్కలు తీస్తే ఏమీ మిగులకపోయేది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ దయవల్ల ఎవుసంపై భరోసా వచ్చింది.  

- బుచ్చ మల్లయ్య, నిజాంపేట (నందిగామ)  

‘రైతు బంధు’తో పెట్టుబడి ఇబ్బందులు తప్పినయ్‌... 

‘రైతు బంధు’తో పెట్టుబడి ఇబ్బందులు తప్పినయ్‌... ఇదివరకు వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చేది. నాకున్న నాలుగు ఎకరాల భూమికి రూ.20వేలు వచ్చినయ్‌. బోరుబావి ఎండిపోవడంతో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నా. వచ్చిన డబ్బులతో ఎరువులు కొన్నా. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.  

- అంకం మల్లేశం, రాందాస్‌గూడ, చిలిపిచెడ్‌ మండలం


రైతు బాంధవుడు కేసీఆర్‌...

తెలంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతున్నది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌. రైతు బంధు డబ్బులు అకౌంట్‌లో జమయ్యాయి. నాకు భూమి ఐదెకరాలకు కొద్దిగా తక్కువగా ఉంది. దీనికి రైతు బంధు డబ్బులు రూ.24,906 అకౌంట్‌లో పడ్డాయి. పెట్టుబడి కోసం ఇబ్బందులు లేకుండా డబ్బులు అందాయి. 

- జయవర్ధన్‌, టేక్మాల్‌


ఎరువులు, విత్తనాలు తెచ్చుకున్నా...

‘రైతు బంధు’ పైసలు రూ.10,625 అకౌంట్లో పడ్డాయి. వాటితో ఎరువులు, విత్తనాలు తెచ్చుకున్నా. ఇదివరకులా అప్పులు చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఎంతో ధీమాగా ఉంది. పెట్టుబడి సాయం అందుతుండటంతో ఎంతో ఆసరాగా ఉంది. రైతులకు సాయమందిస్తున్న సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటా.  

- శ్రీరాములు, టేక్మాల్‌
logo
>>>>>>