ఆదివారం 29 మార్చి 2020
Medak - Mar 03, 2020 , 01:42:44

ఎండాకాలం జర పైలం

ఎండాకాలం జర పైలం
  • పెరుగనున్న భానుడి ప్రతాపం
  • జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యం తప్పదు
  • చిట్కాలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు

మునిపల్లి: వేసవి కాలం ప్రారంభమైంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం 10 దాటితే బయటకు రావడానికి  ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి కాకుండా, ఎండల బారిన పడకుండా కొన్ని చిట్కాలు పాటించి వడదెబ్బకు దూరంగా ఉండాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.


అనారోగ్య సమస్యలు.. 

వేసవి కాలంలో ఎండ వేడిమికి వడదెబ్బతో పాటు కలుషిత నీరు, ఆహారంతో పలు రకాల వ్యాధులు సంభవిస్తాయి. అతిసారం, కామెర్లు తదితర జబ్బులు వచ్చే ప్రమాం ఉందని, అందుకు ఎక్కడపడితే అక్కడ నీరు తాగకుండా పరిశుభ్రమైన, కాచి చల్లార్చిన నీటిని వడబోసి తాగాలి. వేసవి ప్రతాపం వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో ఇబ్బంది కాకుండా ఎక్కువ నీరు తీసుకోవాలి.


వడదెబ్బ రాకుండా జాగ్రత్తలు.. 

తాగే నీటిని శుభ్రపర్చుకోవడానికి బిందెడు నీటిలో ఒక క్లోరిన్‌ బిళ్లను వేసి కనీసం అరగంట తర్వాత నీటిని తాగాలి. తాగునీటికి ఉపయోగించే చేతిబోర్ల వద్ద చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మల, మూత్ర విసర్జన అనంతరం భోజనానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ఐస్‌ క్రీములు, రసాలకు దూరంగా ఉండాలి. ఎండ తీవ్రంగా ఉన్న దృ ష్ట్యా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు బయటకు వెళ్లడం మంచిది కాదని, తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముఖాలకు మాస్క్‌లు, గొడుగులు, టోపీలు, రుమాళ్లు ధరించి వెళ్లాలని, నీళ్లతో పాటు చల్లని పానీయాలు సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి కాలం ముగిసే దాకా అంబలి, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం సేవించాలని తద్వారా సహజసిద్ధంగా లభించే ఖనిజ లవణాలు ఉండడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారన్నారు. కాటన్‌ వస్తువులు, సన్‌గ్లాసెస్‌ వాడాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండలో తిరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  


టీ, కాఫీలు తగ్గించాలి

కూల్‌ డ్రింక్‌లు, రోడ్లపై విక్రహించే వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆయిల్‌ పుడ్‌, జంక్‌పుడ్‌, టీ, కాఫీ వంటివి అతిగా తీసుకోరాదు. మాంసపు ఆహార పదార్థాలు, పచ్చళ్లను దూరం పెట్టాలి.


వడదెబ్బ తగిలితే.. 

వేసవిలో సాధారణంగా అపాయానికి గురి చేసేది వడదెబ్బ. దీనిని సన్‌స్ట్రోక్‌ అంటారు. శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం, శరీరం ఉష్ణాన్ని కోల్పోవడంతో వడదెబ్బ తగులుతున్నది. తీవ్రస్థాయిలో వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి తక్షణమే వైద్యం అందించాలి. తలనొప్పి, తల తిరుగటం, చర్మం ఎండిపోవడం, విపరీతంగా జ్వరం, ఫిట్స్‌ రావడం, అపస్మారక స్థితికి చేరడం వడదెబ్బ లక్షణాలు.. వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. శరీరంపై ఉండే దుస్తులను తొలిగించి చల్లని నీటితో కడుగాలి. లేదా చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఐస్‌ ముక్కలను గుడ్డలో ఉంచి శరీరం అంతా రుద్దితే ఉపశమం కలుగుతున్నది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి గాలి తగిలేలా చూడాలి. రోగికి చల్లని నీరు లేదా లవణాలు కలిపిన నీరు తాగిస్తూ డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లాలి.


వెంటనే వైద్యం చేయించాలి

వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స చేయించాలి. చల్లని ప్రదేశంలో ఉం చి ఉప్పు, పంచదార లాంటి పదార్థాలు కలిపిన నీటిని, ఓఆర్‌ఎస్‌ గాను తాగించాలి. వీటితో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగించాలి. ఎప్పటికప్పుడు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. వడదెబ్బ తగులకుండా జాగ్రత్తాలు తీసుకోవాలి.

 డాక్టర్‌ శిరీష, మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 


logo