గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 02, 2020 , 03:35:37

కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు గోదావరి జలాలు

కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు గోదావరి జలాలు
  • సీఎం కేసీఆర్‌ రూ.25కోట్లు మంజూరు చేశారు...
  • పైప్‌లైన్‌ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశం
  • మూడు నెలల్లో నర్సాపూర్‌ బస్‌డిపో నిర్మాణం పూర్తి చేయండి
  • రూ.5 కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌
  • జూనియర్‌ కళాశాల మైదానంలో మినీ స్టేడియం
  • బస్టాండ్‌ కుంటలో మురికి నీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన
  • రాయారావు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
  • పైరవీలకు తావు లేదు.. అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు
  • పట్టణ ప్రగతిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

‘కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు గోదావరి జలాలను తరలించేందుకు సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్ల నిధులను మంజూరు చేశారు.. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే పైప్‌లైన్‌ పనులను ప్రారంభించాలి.. నర్సాపూర్‌ ఆర్టీసీ బస్‌డిపో పనులు మూడు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి...’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌లతో కలిసి నర్సాపూర్‌ పట్టణంలోని ప్రగతి పనులను మంత్రి  పరిశీలించారు. అనంతరం స్థానిక చిల్డ్రన్స్‌పార్కులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని పాత తహసీల్దార్‌ కార్యాలయ స్థలంలో అత్యాధునిక హంగులతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మిస్తామని, అందుకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జూనియర్‌ కళాశాల పక్కన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామన్నారు. మురికి నీరు బస్టాండ్‌ కుంటలో కలువకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ‘కాళేశ్వరం’ కాల్వను స్థానిక రాయారావు చెరువులో కలిపి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎలాంటి అవినీతి, పైరవీలకు తావు లేకుండా అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.  

- నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ


నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : నర్సాపూర్‌ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్‌డిపో నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక చిల్డ్రన్స్‌ పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో నర్సాపూర్‌ బస్‌డిపోను సందర్శించి 3నెలల్లో పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈఈలను మంత్రి ఆదేశించారు. పట్టణంలోని పాత తహసీల్దార్‌ కార్యాలయం స్థలంలో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌తో పాటు చేపల విక్రయ కేంద్రం, రైతు బజార్‌ను అత్యాధునిక హంగులతో  నిర్మిస్తామన్నారు. ఇందుకోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక జూనియర్‌ కళాశాల పక్కన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని ఇందులో మినీ స్టేడియంతో పాటు షెటిల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులతో పాటు ఇండోర్‌బాడ్మింటన్‌ 800 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌లను కళాశాల, పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణంలో నుంచి మురుగు నీరు స్థానిక బస్టాండ్‌ కుంటలో కలువకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు జాయింట్‌ సర్వే చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను వచ్చే జూన్‌ విద్యాసంత్సరం ప్రారంభం నాటికి పూర్తిచేయాలన్నారు. నర్సాపూర్‌ చెరువులో నీరు శాతం పూర్తిగా తగ్గిపోయి నీటి సమస్య ఏర్పడిందని తాగునీటి సమస్య పరిష్కారం కోసం కోమటిబండ నుంచి నర్సాపూర్‌ నియోజకవర్గంలోని 7 మండలాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తామన్నారు. ఇందు కోసం రూ.25 కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు. 


త్వరలో పైప్‌లైన్‌ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల విషయంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా చేపడుతామన్నారు. పారిశుధ్య సమస్య పరిష్కారం కోసం ముఖ్యంగా మహిళలకు అందజేసిన చెత్తబుట్టలలో తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. రాయారావు చెరువును పర్యటకంగా అభివృద్ధి చేస్తామని, ‘కాళేశ్వరం’ కాల్వ చెరువులో కలుపుతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ అభివృద్ధి మంత్రి సహకరించాలన్నారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తను వేరుగా చేయాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ మాట్లాడుతూ నర్సాపూర్‌ను ఆరద్శమున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే నర్సాపూర్‌ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.2లక్షలను ప్రకటించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ మాలతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజు యాదవ్‌, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి..

నర్సాపూర్‌ రూరల్‌ : నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆదివారం పర్యటించారు. వార్డుల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలను పరిశీలించారు. బస్టాండ్‌ సమీపంలోని కుంటను పరిశీలించి సర్వే చేయాలని, అలాగే కబ్జాకు గురైన ప్రాంతాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. 7, 9వ వార్డుల్లో మురికికాల్వను పరిశీలించి కాల్వలను వెడల్పు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మటన్‌ సెంటర్‌ను సందర్శించి పాత తహసీల్దార్‌ కార్యాలయంలో ఆధునికమైన వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ను నిర్మిద్దామని అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జేసీ నగేశ్‌, మున్సిపాల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ చంద్రాగౌడ్‌,  మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఆర్డీవో అరుణారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 


మార్కెట్‌యార్డు అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి

మనోహరాబాద్‌ : మార్కెట్‌యార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శివ్వంపేట మండల కేంద్రంలో ఈజీఎస్‌, పంచాయతీ నిధులతో నిర్మించిన మార్కెట్‌యార్డును ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. మార్కెట్‌యార్డు నిర్మాణంతో తమకు కూరగాయలు అమ్ముకునేందుకు వీలుకలిగిందని, కాగా మార్కెట్‌యార్డు చుట్టూ ప్రహరీ, మురికికాల్వ నిర్మాణం అవసరమున్నదని అక్కడికి వచ్చిన మహిళలు మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి మార్కెట్‌యార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మిషన్‌భగీరథ సంపు నిర్మాణానికి స్థలపరిశీలన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ మహేశ్‌గుప్తా, సర్పంచ్‌ శ్రీనివాస్‌లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo