బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Mar 02, 2020 , 03:33:49

అభివృద్ధి పనులు ఆగొద్దు

అభివృద్ధి పనులు ఆగొద్దు
  • ఈ నెల చివరి నాటికి పూర్తి చేయండి
  • ఇసుక కొరత ఉందన్న సాకు చెప్పొద్దు.. ముందుగా తెచ్చుకుని నిల్వ చేసుకోండి..
  • తాగునీటి సరఫరా పైప్‌లైన్‌ పనులను ప్రారంభించండి
  • ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్డుల నిర్మాణాలు
  • పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ శాఖ అధికారులకు ఆదేశం
  • నర్సాపూర్‌ మున్సిపాలిటీలో లో ఓల్టేజి సమస్య ఉత్పన్నం కావొద్దు
  • వివిధ శాఖల అధికారుల సమీక్షలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు రానున్న వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లను మంజూరు చేయడం జరిగిందని తక్షణం పనులను ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఆదివారం నర్సాపూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు రకాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌ కోమటిబండ నుంచి నర్సాపూర్‌ నియోజకవర్గానికి తాగునీటి సరఫరాకు గాను పనులను ప్రారంభించాలన్నారు. శివ్వంపేట మండలంలో సంపు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని నీటి సరఫరా విభాగానికి అప్పగించాలని కలెక్టర్‌కు సూచించారు. సోమవారం నుంచి పనులను ప్రారంభించాలన్నారు. త్వరగా టెండర్లను పిలిచి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసి నీటిని అందజేయాలన్నారు. శివంపేట, వెల్దుర్తి మండలాలకు 15 రోజుల్లో నీటి సరఫరా చేయాలని, అలాగే ఏప్రిల్‌ మొదటి వారంలో మిగతా మండలాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సాపూర్‌ మినహా మెదక్‌, అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీటిని ప్రతి రోజు విడిచి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 


జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఇసుక తరలింపు కొరకు కలెక్టర్‌కు అధికారులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపాలిటీలు ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఇసుకను తరలించి నిల్వ చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలలో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్డులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నదని అందువల్ల ఇప్పటికీ ప్రారంభం కాని పనులను త్వరగా ప్రారంభించాలని చివరి తేదీ నాటికి బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ‘లో ఓల్టేజి’ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకుగాను చర్యలు తీసుకోవాలన్నారు. ‘పట్టణప్రగతి’ కార్యక్రమంలో భాగంగా అవసరమున్న ప్రతిపాదనలు సిద్ధం చేసి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూడాలని ఎస్‌ఈ శ్రీనాథ్‌కు సూచించారు. నర్సాపూర్‌ పట్టణంలో ఉన్న సంగారెడ్డి-తూప్రాన్‌ రహదారికి ఇరువైపుల ఉన్న మురికి కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎమ్మెల్యేకు అందజేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మంజూరైన రోడ్లను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు, ఈఈ కనకేశ్‌, పీఆర్‌ఈఈ వెంకటేశ్వర్లు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనాథ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రఘువీర్‌, ఈఈ రాజయ్య, కమలాకర్‌, మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి రమ్య, జిల్లా మైనింగ్‌ అధికారి జయరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట్‌నారాయణ, డీఈ రమణారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


మెదక్‌, నర్సాపూర్‌లో కందుల కొనుగోలు  

జిల్లా కేంద్రంతో పాటు నర్సాపూర్‌లో సైతం కందుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ మిగిలి ఉన్న కందులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నర్సాపూర్‌ రైతుల సౌకర్యార్థం ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అలాగే నర్సాపూర్‌లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో సంగారెడ్డి జిల్లా పరిధిలోని హత్నూర, గుమ్మడిదల మండలాలకు చెందిన కంది రైతుల నుంచి కూడా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణ ప్రదేశంలో పట్టణంలోని ప్రజల సౌకర్యార్థం వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌, రైతు బజార్‌ నిర్మాణానికి 1.5 ఎకరాల అనువైన స్థలం ఉన్నదని, త్వరలో స్థల పరిశీలన చేసి నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని మార్కెటింగ్‌ శాఖ ఎస్‌ఈని మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. సమావేశంలో  కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>