పీవీ బహుభాషా కోవిదులనేది తెలిసిందే. ఆయా భాషలను నామమాత్రంగా నేర్చుకోవడం కాదు వాటిలో పాండిత్యాన్ని సంపాదించారు. అందుకు ఓ ఉదాహరణ హిందీ సాహిత్య చరిత్ర పుస్తకానికి ఆయన రాసిన సుదీర్ఘ ముందుమాట. 2000 సంవత్సరంలో అప్పటి రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ సాహిత్య చరిత్రపై 362 పేజీల ఉద్గ్రంథానికి ముందుమాట రాయాల్సిందిగా పీవీని కోరారు. ఆయన నెల వ్యవధిలో పని పూర్తిచేశారు. భారతీయ భాషా సాహిత్యాల చరిత్ర, భారతీయుల చరిత్రకు ఉన్న అవినాభావ సంబంధాన్ని, అందుకు దోహదపడిన ఆనాటి జీవితాల నుంచి ఉద్భవించిన సాహిత్యాన్ని 36 పేజీల ముందుమాటలో వివరించారు.