శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 29, 2020 , 02:31:23

కందుల కొనుగోళ్లకు.. పచ్చజెండా

కందుల కొనుగోళ్లకు.. పచ్చజెండా

 కంది రైతుల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.   కొనుగోలు కేంద్రాల్లో కందులు ఉండగానే గడువు ముగిసిందని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనతో నిరసనల బాట పట్టారు. రైతుల ఇక్కట్లను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోళ్ల గడువును పెంచుతూ ఉత్తర్వులిచ్చింది... తిరిగి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించింది.  మెదక్‌, నర్సాపూర్‌, చేగుంట ్రప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలుండగా నర్సాపూర్‌లో దాదాపు కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగతా రెండు కేంద్రాల్లో  కొనుగోళ్లు  కొనసాగించేందుకు సన్నాహాలు చేశారు. 

- మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :కంది రైతులకు సర్కార్‌ తీపికబురు వినిపించింది. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కందుల కొనుగోళ్ల గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. రైతుల నుంచి పరిమిత మొత్తంలో కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు పలు చోట్ల నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తీర్చేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే కందుల కొనుగోళ్ల గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి అదనంగా కందులు కొనుగోలు చేయాలని సంకల్పించింది. జిల్లాలో మూడు చోట్ల  కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్‌, నర్సాపూర్‌, చేగుంట కేంద్రాల్లో గడువు ముగిసేవరకు 800 మంది రైతుల నుంచి 476 మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రైతులు తెచ్చిన కందులు అలాగే ఉండిపోయాయి. దీంతో రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. 


వీఆర్వో, ఏవోల అనుమతి తప్పనిసరి..

కందుల కొనుగోలుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం షరతులు విధించింది. మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్‌ వ్యాపారులు కూడా మార్క్‌ఫెడ్‌ కేంద్రాల్లోనే అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కేంద్రాలకు కందులు తీసుకువచ్చే రైతులు ఆయా గ్రామాలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారితో పాటు మండల వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలు లేని రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కందులు కొనుగోలు చేయమని మార్క్‌ఫెడ్‌ అధికారులు సూచిస్తున్నారు.


కొనుగోలు చేస్తాం..

జిల్లాలోని మెదక్‌, చేగుంట కొనుగోలు కేంద్రాల్లో అదనంగా 150 టన్నుల కందులను కొనుగోలు చేస్తాం. ఇప్పటివరకు 476 టన్నుల కందులు కొనుగోలు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.

- నర్సింహారావు, మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారి


మెదక్‌, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కందుల కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కందుల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. మెదక్‌లో కందుల కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ జిల్లా మార్కెఫెడ్‌ డీఎం నర్సింహారావును ఫోన్‌లో ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి రమ్య, అధికారులు ఉన్నారు.


logo