శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 29, 2020 , 02:28:34

త్వరలో గోదావరి జలాలు

త్వరలో గోదావరి  జలాలు

మర్కూక్‌  :  వచ్చే నెలలో కొండపోచమ్మ ప్రాజెక్టుకు ‘కాళేశ్వరం’ జలాలు రానున్నాయని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ పనులు త్వరితగతిన పూర్తిచేసి రిజర్వాయర్‌లోని నీరు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు రజత్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం మర్కూక్‌ మండల కేంద్రంలోని కొండపోచమ్మ జలాశయ నిర్మాణ పనులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. కొండపోచమ్మ జలాశయ నిర్మాణం పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నదని, ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. రిజర్వాయర్‌ వివరాలను సంబంధిత శాఖకు పంపాలని సూచించారు. 


వచ్చే నెలలో ప్రాజెక్టులోకి జలాలు రానున్నందున ఇంకా కావాల్సిన పనులను వారంలో పూర్తి చేయాలన్నారు. 15టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయ పనులను అధికారులతో కలిసి ప్రాజెక్టుపైకి వెళ్లి పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో అధికారులతో మాట్లాడారు. సంప్‌హౌస్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలియజేశారు. అనుకున్న సమయం లోపల కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని పోసేందుకు సంప్‌హౌస్‌లో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టుపైన నిర్మిస్తున్న పైపులైన్లను ఆయన పరిశీలించారు. అనంతరం హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో బయల్దేరారు. కార్యక్రమంలో ఈఎన్సీ మురళీధర్‌, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారి హరిరామ్‌, ఎస్‌ఈ వేణు, ఆర్డీవో విజయేందర్‌ రెడ్డి, ఏసీపీ నారాయణ, సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు, శ్రీశైలం, వీరన్న సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


logo