సోమవారం 30 మార్చి 2020
Medak - Feb 26, 2020 , 23:48:08

జనగణనలో జాగ్రత్తలు పాటించాలి

జనగణనలో జాగ్రత్తలు పాటించాలి
  • ప్రతి కుటుంబం వచ్చే విధంగా బ్లాకులను తయారు చేయాలి
  • సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి
  • అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి
  • తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు జనగణనపై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌, నమస్తే తెలంగాణ : జనగణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్‌కు అప్పగించే బ్లాకులను తయారు చేసేటప్పుడు అపార్ట్‌మెంట్లు, బస్తీలు, చిన్నచిన్న వీధులు సైతం కవర్‌ అయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకొని బ్లాకులుగా విభజించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని ఆడిటోరియంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇతర అధికారులతో జనగణనపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ జనాభా, కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అన్ని విధాలుగా ప్రజలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించేందుకు గానూ ఈ సర్వే ఉపయోగపడుతుందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రతి గ్రామంలోని వీధులు కవర్‌ అయ్యే విధంగా ప్రత్యేక బ్లాకులుగా విభజించాలన్నారు. ఈ విభజించే ప్రక్రియ చేపట్టేటప్పుడు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


ప్రతి కుటుంబం కవర్‌ అయ్యే విధంగా బ్లాకులను తయారు చేయాలన్నారు. అలాగే సర్వే నిర్వహించేందుకు ఉపయోగించే పత్రంలో ఉన్న అన్ని అంశాలపై క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని అప్పుడే మండల స్థాయిలో ఎన్యూమరేటర్లకు తగిన శిక్షణను అందజేస్తారని తెలిపారు. ఏదైనా సందేహం ఉంటే నిపుణుల సమక్షంలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. లేకుంటే మండల స్థాయిలో జరిగే ఎన్యూమరేటర్ల శిక్షణ సమయంలో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో పాటు జనగణన డిప్యూటీ డైరెక్టర్‌ దయాసాగర్‌, జెడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్వో వెంకటేశ్వర్లు, సీపీవో శ్రీనివాసులు, ఆర్డీవోలు సాయిరాం, అరుణ, శ్యామ్‌ప్రకాశ్‌, డీఈవో రమేశ్‌కుమార్‌, తహసీల్ధార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.


logo