బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 26, 2020 , 23:46:37

విజ్ఞానం.. అనంతం

విజ్ఞానం.. అనంతం

మెదక్‌రూరల్‌, నమస్తే తెలంగాణ: విజ్ఞానం అనంతమైనది.. ఎంత తెలుసుకున్నా ఈ విశాల ప్రపంచంలో తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. శాస్త్ర అభివృద్ధి అంతా మానవుని వైజ్ఞానిక మేథో సంపత్తి ఫలితమే అనడంలో సందేహం లేదు. రాళ్లతో నిప్పు పుట్టించడం నుంచి ఆధునిక యుగం వరకు మానవ జీవితంలో వచ్చిన ప్రతి మార్పు విజ్ఞాన ఫలితమే. శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి మానవుడు కనుగొన్న అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ మనుగడను ఎంతో సుఖవంతం చేశాయి. అంధకారంలో ఉన్న మానవ మనుగడను విజ్ఞాన వెలుగులవైపు నడిపించిన ఘనత వైజ్ఞానిక రంగానికే దక్కుతున్నది. 


రామన్‌ ఎఫెక్ట్‌ కనిపెట్టిన రోజు..

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్‌ ఎన్నో భౌతికశాస్త్ర ప్రయోగాలకు మూలంగా నిలిచిన రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన రోజు  ఫిబ్రవరి 28. ఈ రోజు రామన్‌ ఒక వినూత్న, విజ్ఞానశాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేశాడు. ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్చేదం(స్కేటరింగ్‌) చెందినప్పుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత, తక్కువ తీవ్రత కలిగిన రేఖలు ఏర్పడుతాయని, హెచ్చు తీవ్రత కలిగిన రేఖలను స్టోక్‌ రేఖలని, తక్కువ తీవ్రత కలిగిన రేఖలను ప్రతి లేదా వ్యతిరేక స్టోక్‌ రేఖలని తెలియజేశారు. దీనిని రామన్‌ ఫలితం అంటారు. రామన్‌ పరిచ్చేదనంలో పతనకాంతి శక్తి హెచ్‌వీ1, పరిచ్చేదన కాంతి శక్తి హెచ్‌వీ2 సమానం కావు. రామన్‌ వర్ణపటంలో ప్రధాన రేఖకు ఒక వైపు స్టోక్‌ (కాంతివంతమైన) రేఖలు, మరో వైపు ప్రతి స్టోక్‌(కాంతి హీన) రేఖలు ఏర్పడడాన్ని పరిశీలించవచ్చు. ఈ విషయాన్ని సీవీ రామన్‌ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడంతో, ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ కావడంతో దానికి గుర్తుగా భారత ప్రభుత్వం 1987 ఫిబ్రవరి 28నుంచి జాతీయ విజ్ఞాన శాస్త్ర దినంగా ప్రకటించింది. ఈ రోజునే రామన్స్‌డేగా అని కూడా అంటారు. దీంతో ప్రపంచమంతా రామన్‌ పేరు మార్మోగిపోయింది. 


 1930లో  ‘నోబెల్‌', 1954లో ‘భారతరత్న’ పురస్కారాలు  

సీవీ రామన్‌ 1888 నవంబర్‌ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్‌ పెటాయ్‌ అనే గ్రామంలో చంద్రశేఖర్‌ అయ్యర్‌, పార్వతీఅమ్మాళ్‌ దంపతులకు జన్మించాడు. రామన్‌ పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్‌. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి భౌతిక అధ్యాపకుడు కావడంతో రామన్‌ను భౌతికశాస్త్రం వైపు నడిపించింది. బాల్యం నుంచే తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్‌ 12వ యేటనే మెట్రిక్‌ పూర్తి చేశాడు. 1907లోనే ఎంఎస్సీ(ఫిజిక్స్‌)లో యూనివర్సిటీ ప్రథముడిగా నిలిచారు. 18వ ఏటనే కాంతికి సంబంధించిన అంశాలపై చేసిన పరిశోధన వ్యాసం లండన్‌కు చెందిన ఫిలసాఫికల్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఆయన తెలివితేటలను గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండ్‌ వెళ్లి పరిశోధనలు చేయాలని ప్రోత్సహించారు. వైద్య పరీక్షల్లో ఇంగ్లండ్‌ వాతావరణానికి ఆయన ఆరోగ్యం సహకరించదని వైద్యులు పేర్కొనడంతో ఇంగ్లండ్‌ ప్రయాణాన్ని విరమించుకున్నాడు. అనంతరం కలకత్తాలో ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంట్‌ జనరల్‌గా విధుల్లో చేరారు. విజ్ఞానశాస్త్రంపై గల అభిరుచితో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్శిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా చేరారు. సంగీత పరికరాలపై అధ్యయనం చేసిన రామన్‌ 1921లో లండన్‌లో శబ్ధ పరికరాలపై ఉపన్యాసం ఇచ్చారు. లండన్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు సముద్రం నీరు, ఆకాశానికి రెండింటికీ నీలిరంగు ఉండడం ఆయనను ఆలోచింపజేసింది. అప్పటి వరకు అనుకున్నట్లుగా సముద్రపు నీలిరంగుకు కారణంగా ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతి ఫలించడం కాదు, సముద్రం నీటి గుండా కాంతి ప్రసరించినప్పుడు కాంతి పరిక్షేపణ చెందడమేనని ఊహించి పరిశోధనలు చేశారు. పారదర్శకయానం గుండా కాంతి ప్రసరించినప్పుడు పరిక్షేపణం చెందుతుందని 1928 ఫిబ్రవరి 28న ప్రకటించాడు. దీనినే రామన్‌ ఫలితం అంటారు. ఇందుకుగాను 1929లో ఇంగ్లండ్‌ ప్రభుత్వం ‘నైట్‌హుడ్‌' బిరుదుతో సత్కరించింది. ఆ మహనీయుడి పరిశోధనలు, సేవలు గుర్తించి 1930లో నోబెల్‌ బహుమతి ప్రదానం చేశారు. భారత ప్రభుత్వం 1954లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందజేసింది. 1970లో మన నుంచి భౌతికంగా దూరమయ్యారు. 


విజ్ఞానశాస్త్రం - ఒక జీవన విధానం..

విజ్ఞానశాస్త్రం అంటే ఒక సత్యాన్వేషణ, ఒక క్రమబద్దమైన విజ్ఞానం, మరోలా చెప్పాలంటే ఆధునిక సమాజంలో మానవ జీవితంలో అంతర్భాగంగా మారిన జీవన విధానం. ఇందుకు కారణమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గుహలు, చెట్టు తొర్రలో నివసించిన ఆది మానవుడు కాలం నుంచి ప్రస్తుతం వరకు వ్యాపారాలకు, నివాసానికి అనుకూలంగా అతి తక్కువ స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు విజ్ఞానశాస్త్ర ప్రగతికి నిదర్శనం. ఎరువుల కర్మాగారాలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, చమురుశుద్ది, ఉక్కు కర్మాగారాలు, ఔషధ తయారీ పరిశ్రమలు, వాహనాల పరిశ్రమలన్నీ విజ్ఞానశాస్త్ర ఫలితమే. ఆహారోత్పత్తిలో హరిత విప్లవానికి దారి తీసి మేలు రకం వరి, గోధుమ, జొన్న తదితర కొత్త పంటల రూపకల్పన అంతా సైన్స్‌ ఫలితమే. రవాణా రంగంలో ఊహించని మార్పులు సైతం సైన్స్‌ ఫలితమే. ఎద్దుల బండితో మొదలైన మానవుడి ప్రయాణం కారు, రైలు, ఓడ, విమానం వంటి అత్యాధునిక రవాణా సాధనాలతో వేగవంతమైంది. ఎన్నో అంతుచిక్కని రోగాలకు మందులను కనిపెట్టబడడం సైన్స్‌ వల్లే సాధ్యమైంది. ఇంకా ఎన్నో రకాల రోగాలకు మందులను కనుక్కోవడంలో విజ్ఞానశాస్త్రం ముందుకు సాగుతున్నది. సైన్స్‌ కారణంగా మానవుడికి అందుబాటులోకి వచ్చిన రేడియో, టీవీ, కంప్యూటర్‌, టెలిఫోన్‌, సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌లతో ప్రపంచమంలో ఎక్కడో మారుమాల ప్రాంతంలో జరిగిన విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. నేడు వైజ్ఞానికశాస్త్ర రంగాల్లో భారత్‌ ప్రపంచ దేశాలతో పోటీపడి విజయవంతంగా ముందుకు దూసుకెళ్లిపోతున్నది. 


logo