మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 26, 2020 , 00:03:32

డీసీసీబీపై గులాబీ జెండా

డీసీసీబీపై గులాబీ జెండా
  • డీసీసీబీ, డీసీఎంఎస్‌లు అధికార పార్టీ కైవసం
  • డీసీసీబీలో 18 డైరెక్టర్లు..
  • డీసీఎంఎస్‌లో 7 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం..
  • 29న డైరెక్టర్లకు అధికారిక పత్రాల జారీ
  • అదేరోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అనుకున్నట్లుగానే డీసీసీబీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, మార్కెటింగ్‌ సొసైటీల్లో పూర్తి స్థాయిలో డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా కేంద్ర కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. డీసీసీబీలో 20 డైరెక్టర్‌ స్థానాలు ఉండగా, 2 ఎస్టీ స్థానాలకు ఎన్నిక జరుగలేదు. మిగతా 18 డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు వచ్చాయి. దీంతో అధికారులు 18 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించారు. డీసీఎంఎస్‌లో 10 డైరెక్టర్‌ స్థానాలకు ఎస్సీ, ఎస్టీలు లేని కారణంగా 3 స్థానాల్లో ఎన్నికలు జరుగలేదు. మిగతా 7 డైరెక్టర్లలో 4 డైరెక్టర్‌ స్థానాలతో పాటు ఫిషర్‌మెన్‌, పోస్టల్‌శాఖ ఉద్యోగుల నుంచి ముగ్గురు డైరెక్టర్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు మాత్రమే రావడంతో మొత్తం ఏడు డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఈ నెల 29న ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లకు అధికారికంగా ధ్రువపత్రాలు అందించనున్నారు. అదేరోజు డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.


చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమే..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కూడా ఏకగ్రీవంగానే జరుగనున్నది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం సీల్డ్‌ కవర్‌లో పేర్లు పంపించనున్నట్లు నాయకులు చెబుతున్నారు. ఎన్నికైన డైరెక్టర్లు పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్ఠానం సూచించిన అభ్యర్థిని డైరెక్టర్లు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నుకోనున్నారు. ఈనెల 29న ఉదయం డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. ఆ తరువాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎవరి పేరు సూచిస్తే వారే చైర్మన్‌ అవుతారని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. డైరెక్టర్లకు ఎలాగైతే ఒకే నామినేషన్‌ వచ్చాయో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు ఒకే నామినేషన్లు వస్తాయని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ముగియనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు.logo
>>>>>>