బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 26, 2020 , 00:02:33

సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి

సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి

మెదక్‌ రూరల్‌ : సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలని సుస్థిర వ్యవసాయ పరిశోధన అధికారి యాదవరెడ్డి అన్నారు. సేంద్రియ కూరగాయల సాగుపై జిల్లా కేంద్రంలోని సమైక్య కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్‌, పాపన్నపేట, శంకరంపేట, వెల్దుర్తి, మనోహరాబాద్‌, తూప్రాన్‌, చిలిపిచెడ్‌ మండలాల ఏపీఎం, సీసీలు, రైతులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సుస్థిర వ్యవసాయ పరిశోధన అధికారి యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు వీలైనంత మేరకు భూసార పరీక్షలు చేయించి, నేలలోని లోపాలకు అనుగుణంగా సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. రసాయనిక ఎరువులు వాడొద్దన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో పేరట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసేవారని, నేడు మారుతున్న జీవనశైలి, ఇతర కారణాల వల్ల కూరగాయల సాగుచేసే అలవాటు తగ్గిందన్నారు. అలా కాకుండా గ్రామాల్లో ఆసక్తి ఉండి అర ఎకరా భూమిలో నీటి వసతి కలిగి ఉండే రైతులకు శిక్షణ ఇచ్చి సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో పండించవచ్చన్నారు.


సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అంతేకాకుండా కూరగాయలను గ్రామాల్లో మొబైల్‌ వ్యాన్‌ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కూరగాయల సాగు విధానంపై పలు సూచనలు చేశారు. అనంతరం మెదక్‌ మండలం మాచవరంలో సేంద్రియ పద్ధతిలో సాగు  చేస్తున్న పంటలను పరిశీలించారు. పంటల దిగుబడి, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు.  సమావేశంలో ఏపీఏంలు వెంకచేశ్వర్లు, శంకరయ్య, సాయిలు, వెంకస్వామి, రామస్వామి, సుశీల, ప్రేమలత, శ్రీనివాస్‌, సీసీలు, రైతులు పాల్గొన్నారు.   logo
>>>>>>