మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 25, 2020 , 23:56:49

గవ్వలపల్లి, టి.మాందాపూర్‌ గ్రామాల్లో రాష్ట్ర పరిశీలకుడు చిరంజీవి పర్యటన

గవ్వలపల్లి, టి.మాందాపూర్‌ గ్రామాల్లో రాష్ట్ర పరిశీలకుడు చిరంజీవి పర్యటన

చిన్నశంకరంపేట : మండలంలోని గవ్వలపల్లి, టి. మాందాపూర్‌ గ్రామాల్లో మంగళవారం పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకుడు, ఐఏఎస్‌ సీనియర్‌ అధికారి చిరంజీవి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మించిన డంపుయార్డులు, శ్మశానవాటికలను ఆయన పరిశీలించారు. పాఠశాలలను సందర్శించి, విద్యార్థులను ప్రశ్నలు అడుగగా, సమాధానాలు చెప్పడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో జరిగిన పనుల వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నీళ్లు బాగా వస్తున్నాయా... వీధిలైట్లు వెలుగుతున్నాయా.. చెత్త బుట్టలను అందించారా... మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు చేశారా.. అంటూ ఆరా తీశారు.  గ్రామాల్లో నాటిన మొక్కల్లో ఎంత శాతం మొక్కలు పెరిగాయని కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం పనులు ఎలా నిర్వహిస్తున్నారు... గ్రామాలకు ఎన్ని నిధులు వచ్చాయి.. హరితహారం, పారిశుద్ధ్యం పనులకు ఎంతెంత ఖర్చు చేశారని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏమైనా కొత్తగా కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారా.. కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారా... అని అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నులు ఎంత శాతం వసూలు చేశారని అడిగారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. గ్రామంలోని పురాతన ఇండ్లు, బావులను పూడ్చి వేశారని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో డీపీవో హనోక్‌, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, ఎంపీవో గిరిధర్‌రెడ్డి, ఈజీఎస్‌ ఏపీవో వెంకటసాయి, సర్పంచ్‌ భిక్షపతి గౌడ్‌, ఎంపీటీసీ ప్రసాద్‌గౌడ్‌, ఏకే యాదవరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


logo
>>>>>>