శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 25, 2020 , 04:41:05

'ప్రగతి' కి శ్రీకారం

'ప్రగతి' కి శ్రీకారం

‘పల్లెప్రగతి’ స్ఫూర్తితో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలిల్లో ్రప్రారంభమైంది. ఇటీవలే  మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన విధంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌,   మున్సిపల్‌ చైర్మన్లు, ఇతర అధికారులు సోమవారం ఆయా మున్సిపాలిటీలల్లో పర్యటించి సమస్యల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ తదితరులు మెదక్‌లో ్రప్రారంభ సమావేశం నిర్వహించి పలు వార్డుల్లో తిరిగి సమస్యలు గుర్తించారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌తో కలిసి పట్ణణంలో పర్యటించారు. తూప్రాన్‌, రామాయంపేటలలో మున్సిపల్‌ చైర్మన్లు రాఘవేందర్‌ గౌడ్‌, జితేందర్‌గౌడ్‌ కౌన్సిలర్లు ఇతర అధికారులతో కలిసి ఆయా పట్టణాల్లో సమస్యలపై ఆరా తీశారు. అన్ని మున్సిపాలిటీలల్లోనూ ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ్రప్రారంభించారు. ఆయా మున్సిపాలిటీల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


మెదక్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో పల్లెల రూపురేఖలు మారాయి. ‘పట్టణప్రగతి’ కార్యక్రమంతో పట్టణాలు సైతం ఆదర్శవంతంగా తయారు కావాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణప్రగతి కార్యక్రమాన్ని మెదక్‌ మున్సిపల్‌ పరిధిలోని అవుసులపల్లి గ్రామంలోని 2వ వార్డులో కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ముందుగా 2వ వార్డులోని ప్రధాన వీధులతో పాటు దళిత కాలనీల్లో పర్యటించి వార్డులోని పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు, తాగునీటి సమస్యల గురించి వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయితే పర్యటనలో భాగంగా పాడుబడిన బావిని గుర్తించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తక్షణం మూసివేయాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అంతేకాకుండా వార్డుల్లోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు గాను ఉన్న రెండు వాటర్‌ ట్యాంకుల వద్ద పారిశుధ్య పరిస్థితి సరిగ్గా లేదని రానున్న రోజుల్లో ఇక్కడ ఇంకుడు గుంతలను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి కి ఆదేశించారు.


ఇదిలావుండగా ఖాళీ ప్రాంతాల్లో చెత్తాచెదారం అలాగే ఉందని సంబంధిత యజమానుల దృష్టికి తీసుకెళ్లి శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని లేనిచో వారికి నోటీసులను అందజేయాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్డుల్లో చెత్తాచెదారం వేయకుండా ప్రజలు చూడాలని, ఎవరైనా చెత్తను బయట వేస్తే వెంటనే వాట్సాప్‌ పెట్టండని తెలిపారు. 2, 3వ వార్డుల్లో విద్యుత్‌ సమస్యల గురించి ట్రాన్స్‌కో డీఈతో మాట్లాడటం జరిగిందని, వెంటనే విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికీ నల్లా కలెక్షన్‌ను అందజేయడం జరుగుతుందని, మార్చి 1 నుంచి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


‘పట్టణప్రగతి’ నిరంతరం కొనసాగాలి..

‘పట్టణప్రగతి’ నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే అన్నారు. పది రోజుల పాటు నిర్వహించే ‘పట్టణ ప్రగతి’లో అవుసులపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. వారం రోజుల తర్వాత మళ్లీ వస్తానని, అప్పుడు గ్రామంలో ఎలాంటి ప్రగతి లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ విషయంలో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామ స్పెషల్‌ ఆఫీసర్‌ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చూడాలని ఆదేశించారు. 2వ వార్డులో నర్సరీని ఏర్పాటు చేసి అందులో జామ, సపోటతో పాటు మరిన్ని మొక్కలను పెంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.


అవుసులపల్లిలో రూ.50లక్షలతో సీసీరోడ్లు..

మెదక్‌ మున్సిపాలిటీలో విలీనమైన అవుసులపల్లి 2, 3వ వార్డుల్లోని సీసీరోడ్లకు రూ.50లక్షలు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామం బాగుంటేనే మనం బాగుంటామని, మన పిల్లల భవిష్యత్‌ కోసం గ్రామాన్ని ఆదర్శవంతంగా తయారు చేసుకోవాలని సూచించారు. ‘పట్టణప్రగతి’లో 60 మంది సభ్యులను ఎంపిక చేయడం జరిగిందని, వారందరూ ప్రతిరోజు ఉదయం వేళల్లో గ్రామంలోని పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

చెత్తబుట్టల పంపిణీ..

పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్‌ మున్సిపల్‌ పరిధిలోని 2, 3వ వార్డుల్లో మహిళలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందని, తడి, పొడి చెత్తను వేరు చేసి ఆ రెండింటిలో వేసి మున్సిపల్‌ సిబ్బందికి అందజేయాలని సూచించారు.  

కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, కౌన్సిలర్లు కొర్వి వేధవతి రాములు, విశ్వం, కిశోర్‌, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణగౌడ్‌, జయరాజ్‌, సమీయొద్దీన్‌, బట్టి లలిత, గడ్డమీది యశోద, సులోచన, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు మందుగుల గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లింగారెడ్డి, యువ న్యాయవాది జీవన్‌రావు, అవుసులపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.  


‘పట్టణప్రగతి’ని విజయవంతం చేస్తాం..

‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం. సోమవారం ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని పట్టణంలోని 2వ వార్డులో ప్రారంభించాం. మెదక్‌ మున్సిపల్‌ పరిధిలోని 32 వార్డుల్లో ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్ని వార్డుల్లో కూడా పారిశుధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తాం. మెదక్‌ పట్టణంలోని ‘పట్టణప్రగతి’ కోసం 32 వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తాం. పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలందరూ సహకరించాలి.

- మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌


ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి 

ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకుగాను ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాం. అందరూ తమ తమ ఇంటి చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన  అవసరం ఉన్నది. అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలు ప్రబలి అనేక రకాల రోగాలకు దారి తీస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ముందుగా పల్లెల్లో ‘పల్లెప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పట్టణాలను కూడా సర్వాంగ సుందరంగా రూపుదిద్దడం కోసం ప్రభుత్వం ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి వార్డుకు గాను 60 మంది సభ్యులతో కార్యాచరణ కమిటీతో పాటు పనుల పర్యవేక్షణకు గాను ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. వార్డులోని సమస్యలను గుర్తించి వాటిని ప్రత్యేక రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలి. ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని నీటిని సరఫరా చేసేందుకు గాను ప్రత్యేకంగా కంట్రోల్‌ వాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హరితహారం కార్యక్రమాలకు సైతం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ప్రతి 5 వార్డులకు కలిపి ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ అవసరమైన మొక్కలను నమోదు చేసుకోవాలన్నారు. సర్వేలో తెలిపిన మొక్కలను నర్సరీలో పెంచి అందజేయడం జరుగుతుంది. వాటిని వార్డులోని ఖాళీ ప్రదేశాలు, రోడ్లకిరువైపులా మొక్కలను నాటేందుకుగాను ప్రజలు కృషి చేయాలి. పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషి..


‘పట్టణప్రగతి’లో పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తాం. ‘పట్టణప్రగతి’ కార్యక్రమంలో భాగంగా అవుసులపల్లి గ్రామంలో ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించాం. ‘పట్టణప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఉదయం అన్ని వార్డుల్లో తిరుగుతూ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అన్ని వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. మున్సిపల్‌ అధికారులతో పాటు కౌన్సిలర్లు, ప్రజలు సహకరించాలి.  


logo