మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 24, 2020 , 01:06:06

పట్టణ ప్రగతిని

పట్టణ ప్రగతిని
  • జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నేటి నుంచి పట్టణప్రగతి
  • మార్చి 4వ తేదీ వరకు నిర్వహణ
  • ఒక్కో వార్డుకు ప్రత్యేకాధికారి నియామకం
  • ప్రతి వార్డులో 4 రకాల కమిటీలు
  • ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున మొత్తం 60 మంది
  • పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రగతి కార్యక్రమం
  • అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి
  • మెదక్‌, రామాయంపేట మున్సిపల్‌ పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి

పల్లెప్రగతితో చాలావరకు సమస్యలు పరిష్కారమవ్వడంతో గ్రామాలు సుందరంగా తయారయ్యాయి. అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణ పరిశుభ్రత, పచ్చదనమే లక్ష్యంగా నేటి నుంచి వచ్చేనెల 4 వరకు పదిరోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పదిరోజులపాటు ఏ పనులు చేపట్టాలి..? ప్రాధాన్యత క్రమంలో ఏవి చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.  ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా నూతన పురపాలక చట్టం ప్రకారం పనిచేయకుంటే పదవులు పోతాయని హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా నర్సరీల ఏర్పాటు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనడం, కరెంటు సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, వైకుంఠ ధామాలు, పాడుబడిన ఇండ్ల కూల్చివేతతోపాటు ఆయా మున్సిపాలిటీల్లో నిరక్షరాస్యుల జాబితా తయారు చేయనున్నారు. పనుల పర్యవేక్షణకు వార్డుకో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ప్రతి వార్డులో 4 రకాల కమిటీలు వేయగా, ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున 60 మంది ఉంటారు.  ఆదివారం మెదక్‌, రామాయంపేట మున్సిపల్‌  చైర్మన్ల అధ్యక్షతన నిర్వహిం చిన పట్టణప్రగతి సమీక్ష సమావేశానికి కలెక్టర్‌ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఆయన మాట్లాడు తూ పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

- మెదక్‌, నమస్తే తెలంగాణ


మెదక్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి. ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యలు ఈ కార్యక్రమంతో పరిష్కారానికి నోచుకున్నాయి. పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక విజయవంతం కావడంతో ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో సైతం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇవ్వడంతో మెదక్‌ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ‘పట్టణ ప్రగతి’కి అధికారులు ముందస్తుగా సన్నాహాలు మొదలుపెట్టారు. ‘పల్లె ప్రగతి’లో మారుమూల గ్రామాలను సైతం సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.  రెండోవిడుతలుగా నిర్వహించిన ‘పల్లె ప్రగతి’కార్యక్రమంతో మెదక్‌ జిల్లాలోని అన్ని గ్రామాలు నేడు సుందరంగా మారిపోయాయి. మురికి కాల్వలు, రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. రోడ్ల వెంట ఖాళీస్థలాల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. పల్లెల్లో చాలా కాలంగా ఉన్న పాడుబడ్డ ఇండ్లను తొలిగించడం, తాగునీటి సదుపాయం, రోడ్ల నిర్మాణం, పాఠశాలలకు సదుపాయాలు, కొత్త పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, వైకుంఠధామాల ఏర్పాటు, పశువులకు దవాఖానలు, గ్రామాల్లో చెత్తాచెదారాన్ని, ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులో పారవేసేలా ఆటో రిక్షాలు, ట్రాక్టర్లను సైతం అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంతో పల్లెల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి పల్లెను అందంగా తీర్చిదిద్దుతున్నది.


ఇక ‘పట్టణప్రగతి’పై నజర్‌..

రెండు విడుతలుగా ‘పల్లెప్రగతి’ని చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాజాగా ‘పట్టణప్రగతి’ బాట పట్టింది. గ్రామాల మాదిరిగానే ఇకపై పట్టణాలను కూడా సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి ఇటీవలే సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ‘పల్లెప్రగతి’ని విజయవంతం చేసిన మాదిరిగానే ‘పట్టణప్రగతి’ని కూడా నిర్వహించి పట్టణాల రూపురేఖలు మార్చాలని సూచించారు. మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట, మెదక్‌ పట్టణాల్లో ఈ నెల 24వ తేదీన ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లోనూ పాలకవర్గాలు ఇటీవలే కొలువుదీరాయి. ప్రభుత్వం నుంచి ‘పట్టణప్రగతి’ కార్యక్రమానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ చైర్మన్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధికారులకు ‘పట్టణప్రగతి’పై దిశానిర్దేశం చేశారు. వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యలను గుర్తించనున్నారు. ఆ తర్వాత బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ‘పట్టణప్రగతి’ బాధ్యత ఆయా మున్సిపాలిటీల కౌన్సిలర్లతో పాటు వార్డుస్థాయిలో ఏర్పాటు చేసే అభివృద్ధి కమిటీలకు అప్పగించనున్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా వార్డుల కౌన్సిలర్ల తీర్మానాలను తీసుకునే అవకాశం ఉన్నది.


వార్డుల వారీగా పారిశుధ్యం, పచ్చదనంపై దృష్టి.. 

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ నెల రోజుల పాటు శుభ్రత కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. చెత్తాచెదారం, శిథిల భవనాలు తొలిగింపు, డ్రైనేజీల శుభ్రంతో పాటు ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టనున్నారు. వార్డుల వారీగా ఇంటింటికీ, అలాగే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. 


వార్డులల్లో కమిటీలు.. అధికారులు..

1.మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు  ఉండగా, ప్రతి వార్డులో నాలుగు  ప్రజా కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున వార్డుకు 60 మంది సభ్యులు ఉంటారు. మున్సిపల్‌లో మొత్తం 1920 మంది  సభ్యులుంటారు. 

2.తూప్రాన్‌ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున వార్డుకు 60 మంది సభ్యులు ఉంటారు.  మున్సిపాలిటీలో మొత్తం 900 మంది సభ్యులు ఉంటారు. 

3. నర్సాపూర్‌లో 15 వార్డులు ఉండగా, ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున వార్డుకు 60మంది సభ్యులు ఉంటారు.  మున్సిపాలిటీలో మొత్తం 960 మంది సభ్యులు ఉంటారు. 

4. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున వార్డుకు 60 మంది సభ్యులు ఉంటారు. మున్సిపాలిటీలో మొత్తం 720 మంది సభ్యులు ఉంటారు. 


అంతేకాకుండా ప్రతి వార్డుకు ఒక జిల్లాస్థాయి అధికారిని స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. వీరు ప్రతి రోజు ఉదయం గంట పాటు తమ వార్డు పరిధిలో తిరుగుతూ చేసిన పనులను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిస్తారు. వార్డుల్లోని సమస్యలను తక్షణమే స్పందించి కమిషనర్‌కు, కలెక్టర్‌కు తెలియజేసి పరిష్కరిస్తారు. 


డంపుయార్డులు, నర్సరీల ఏర్పాటు...

‘పట్టణప్రగతి’లో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో అవసరం మేరకు డంపుయార్డుల నిర్మాణంతో పాటు ప్రతి వార్డులో ఒక నర్సరీని ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై కూడా దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ దవాఖానలు, డిస్పెన్సరీల్లో మందులు, ఇతర సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యంగా పట్టణ ప్రగతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


పకడ్బందీగా ‘పట్టణప్రగతి’.. 

అన్ని మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం కోసం బడ్జెట్‌లో కనీసం 10శాతం నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తున్నది. పట్టణాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా నెల రోజుల కార్యాచరణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఇటీవలే అధికారులకు సూచించారు. ‘పల్లెప్రగతి’తో గ్రామాలు కళకళలాడగా, త్వరలోనే పట్టణాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. 


‘పట్టణ ప్రగతి’లో చేసే పనులివే..

ఓపెన్‌, అండర్‌ డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడం, పూడికను తీయడం.

ఇళ్లపై ఉన్న విద్యుత్‌ వైర్లను గుర్తించి సరిచేయడం, వీధిదీపాలు అమర్చడం.

పట్టణంలో 10 టాయిలెట్లను ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్‌ చేయడం.

మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 60శాతం ఆస్తిపన్ను వసూలైంది. మిగతా వసూలుకు చర్యలు తీసుకోవడం.

పట్టణంలో వైకుంఠధామాల నిర్మాణాలు, ఉన్న వాటిని వినియోగించేలా ప్రజలకు చెప్పడం.

25మంది జనాభా చొప్పున పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం.

ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు తీసుకోవడం, క్లాత్‌ బ్యాగుల తయారీకై చర్యలు చేపట్టడం.

మున్సిపల్‌ వర్కర్లందరికీ బీమా సౌకర్యం కల్పించడం, వారి రక్షణకు అవసరమైన సామగ్రిని అందజేయడం.

మున్సిపల్‌లో గ్రీవెన్స్‌ నిర్వహించడం, సమస్యలకు పరిష్కారం చూపడం.

ప్రభుత్వ భూములు గుర్తించడం, వాటిని కాపాడటం, ఆక్రమణలపై చర్యలు చేపట్టడం.

నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, మిషన్‌ భగీరథతో నీళ్లందించడం.


logo
>>>>>>