సోమవారం 30 మార్చి 2020
Medak - Feb 24, 2020 , 01:05:16

ఆరో వారం.. పోటెత్తిన భక్తులు

ఆరో వారం.. పోటెత్తిన భక్తులు
  • జనసంద్రంగా మారిన మల్లన్న క్షేత్రం
  • సుమారు 40 వేలమంది వచ్చినట్లు అంచనా

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో 6వ వారం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 6వ వారం సందర్భంగా సుమారు 40వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తు లు ప్రైవేట్‌, ఆలయ నిర్వహణలోని గదులను అద్దెకు తీసుకుని రాత్రికి బస చేశారు. అనంతరం ఆదివారం వేకువజామునే కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు  చెల్లించుకున్నారు. మహిళల భక్తిశ్రద్ధలతో బోనాలు తయారు చేసి కొండపైన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కొందరు రాతి గీరల వద్ద ప్రదక్షిణలు, కోడెలు కట్టారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోశ్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. పాలక మండలి సభ్యులు నర్సింహులు, నాగిరెడ్డి, ఏఈవోలు సుదర్శన్‌, శ్రీనివాస్‌, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ఏఈలు అంజయ్య, ప్రతాప్‌, సిబ్బంది బత్తిని పోచయ్య, పోచయ్య, విజయ్‌కుమార్‌, వెంకటచారి, జగదీశ్వర్‌, మాధవి, నర్సింహులు, అర్చకులు సేవలందించారు. 


logo