బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 23, 2020 , 00:38:26

మోగిన నగారా

మోగిన నగారా

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లా స్థాయిలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షుల ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి టి.ప్రసాద్‌ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 25వ తేదీన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, సాయంత్రం ఉపసంహరణలు ఉంటాయని వెల్లడించారు. అలాగే ఈనెల 28వ తేదీన పోటీలో ఉన్న అభ్యర్థులకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఫలితాలు వెల్లడిస్తామన్నారు. మరుసటి రోజు 29వ తేదీన ఎన్నికైన అధ్యక్షులు నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేస్తారు. 28వ తేదీన జరిగే పోలింగ్‌ సంగారెడ్డిలోని బాలుర జూనియర్‌ కళాశాలలో ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. పీఏసీఎస్‌లో ఎన్నికైన అధ్యక్షులు, ఇతర సొసైటీల అధ్యక్షులు పోలింగ్‌లో పాల్గొంటారు. 


కేటగిరీల వారీగా రిజర్వేషన్లు.. 

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో పీఏసీఎస్‌-ఏ కేటగిరి విభాగంలో ఎస్సీ-1, ఎస్టీ-1, బీసీ-1, ఇతరులు-3, మొత్తం ఆరుగురు సభ్యులుగా ఉంటారు. అలాగే ఇతర సొసైటీల నుంచి ఎస్సీ-1, బీసీ-1, ఇతరులు -2తో కలిపి నలుగురు సభ్యులు పాలకవర్గంలో సభ్యులుగా ఎన్నుకుంటారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను నామినేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.1 వేలు, బీసీలకు రూ.2వేలు, ఇతర అభ్యర్థులకు రూ.4వేల చొప్పున చెల్లించి నామినేషన్‌ దాఖలు చేయాలి.  


నామినేషన్‌ వేసే అభ్యర్థులకు సూచనలు.. 

నామినేషన్‌ ఫారంలో ఫొటో అభ్యర్థి ప్రవేశ సంఖ్య, సంతకంతో పాటు మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జత చేయాలి. అలాగే ఆధార్‌, బ్యాంకు పాస్‌ బుక్‌, పాన్‌కార్డు జిరాక్స్‌ కాపీలు సమర్పించాలి. ప్రతిపాదకులు, బలపర్చే వ్యక్తి ప్రవేశ సంఖ్య, సంతకం చేయాలి. ఫీజు మినహాయింపు కోరే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ను నామినేషన్‌కు జతపర్చాలి. లేనిచో ఫీజు మినహాయింపు ఉండదని నోటిఫికేషన్‌లో వివరించారు. ఈనెల 25వ తేదీన ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నామినేషన్లు దాఖలు చేయాలి. ఓటర్లందరూ గుర్తింపు కార్డులు జిరాక్స్‌లను కలిగి ఉండాలని సూచించారు. బీ కేటగిరి సభ్యులు వారి సంఘానికి జరిగిన ఎన్నికల ప్రోసీడింగ్‌ కాపీ, గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని ఎన్నికల అధికారి ప్రసాద్‌ ప్రకటించారు.  


logo
>>>>>>