బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 23, 2020 , 00:37:16

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

పెద్దశంకరంపేట : దక్షిణకాశీగా ప్రసిద్దిగాంచిన శ్రీకొప్పోల్‌ ఉమాసంగమేశ్వర ఆలయంలో జాతర ప్రతియేటా మహాశివరాత్రి రోజు ప్రారంభమవుతున్నది. నాలుగురోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. శనివారం నిర్వహించిన ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచేకాక హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, కర్ణాటక, మహరాష్ట్రల నుంచి సుమారు 50వేలమంది భక్తులు తరలివచ్చి ఉమాసంగమేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. 

 

కొప్పోల్‌లో భక్తుల ప్రత్యేక పూజలు

కొప్పోల్‌కు శనివారం భక్తులు వేలాది సంఖ్యలో హాజరై ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు స్నానాలాచరించి స్వయంభులింగంగా వెలసిన శివలింగానికి జలాభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకం, శత రుద్రాభిషేకం, అభిషేకం, పాలాభిషేకం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయకమిటీ తాగునీరు, భోజనవసతి కల్పించారు. 


వైభవంగా ఉమాసంగమేశ్వరుడి కల్యాణం

కొప్పోల్‌ ఉమాసంగమేశ్వరుని ఆలయ ఆవరణలో వేదబ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో....మరోవైపు మంగళవాయిద్యాల చప్పుళ్లతో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజారులు అనంతరాజ్‌, మహేశ్‌, సంగప్పలు కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో తరళివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.


ఘనంగా బండ్ల ఊరేగింపు

కొప్పోల్‌ ఆలయంలో బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. దీనికి హాజరైన సుమారు 32 బండ్లకు సప్త వర్ణాల చీరలతో, రంగు రంగుల కాగితాలతో చేసిన అలంకారాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం శోభాయమానంగా అలంకరించిన ఎడ్లబండ్లను ఊరేగిస్తూ గుడిచుట్టూ ప్రదర్శన నిర్వహించారు. వేప, మామిడి కొమ్మలు, చీరలు, రవికలు, కొబ్బరి మట్టలతో అలంకరించి దేవతామూర్తుల ప్రతిమలను బండ్లపై ఉంచారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండాపేట తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, ఎస్‌ఐ సత్యనారాయణలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు పద్మ బాపిరాజు, రాయిని విఠల్‌, శంకరయ్య, పరమేశ్వర్‌రెడ్డి, అనంత్‌రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo