సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 22, 2020 , T00:50

జన జాతర

జన జాతర

జాతర సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని ఆలయ పూజారులు ప్రత్యేకంగా అలంకరించారు. గర్భగుడిని రకరకాల పూలతో అలంకరించడంతో చూపరులను ఇట్టే ఆకట్టుకున్నది. మామూలు రోజుల్లో అమ్మవారికి వెండి కిరీటం ఉండగా, జాతరలో మాత్రం బంగారు కిరీటం, బంగారు నగలుతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం రకరకాల పూలు, విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు.


లేజర్‌ లైట్ల మధ్య.. 

ఏడుపాయల జాతరను పురస్కరించుకుని ఏడుపాయల సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు ఏడుపాయల ఆలయాన్ని లేజర్‌ లైట్లతో అలంకరించారు. లేజర్‌లైట్లతో ఏడుపాయల ఆలయం రాత్రి సమయంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. 


వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు రాక..  

రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి తరలివస్తున్న భక్తులు నాగ్సాన్‌పల్లి కమాన్‌ వద్దకు చేరుకుని అక్కడి నుంచి చెలిమెల కుంట వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు ద్వారా ఏడుపాయలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా నాగ్సాన్‌పల్లి, పోతాన్‌శెట్టిపల్లి నుంచి ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం ద్వారా కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.  


జాతరకు బస్సుల సౌకర్యం.. 

భక్తుల సౌకర్యార్థం ఏడుపాయల జాతరకు రావడానికి ఆర్టీసీ బస్సులతో పాటు అదనంగా మూడు మినీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, సంగారెడ్డి, జోగిపేట, నర్సాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పోతాన్‌శెట్టిపల్లి నుంచి టేకులగడ్డ సమీపాన తమ తమ వాహనాలను నిలుపాల్సి వస్తుంది. దీంతో అక్కడ నుంచి ఏడుపాయలకు రావాలంటే రెండు కిలోమీటర్లు ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు మినీ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. 


మంజీరా నదిలో పుణ్యస్నానాలు.. 

సింగూరు ఆనకట్టలో సరిపడా నీరు లేకపోవడంతో ఈ సంవత్సరం ఘనపూర్‌ ఆనకట్టకు నీరు చేరుకోలేదు. దీంతో సంబధిత అధికారులు ఘనపూర్‌ ఆనకట్టలోని గుంతలలో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా చెక్‌డ్యామ్‌లను నింపారు. దీంతో భక్తులు చెక్‌డ్యామ్‌, మంజీరా పాయల్లో ఏర్పాటు చేసిన షవర్ల సహాయంతో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. 


భక్తులకు తగిన ఏర్పాట్లు.. 

తాగునీటి సమస్య తలెత్తకుండా జాతరలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నల్లాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జాతరలో 15ట్యాంకర్లతో తాగు నీటిని అందిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి క్యూలో వేచిఉన్న భక్తులకు సైతం తాగునీరు అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర వైద్య సదుపాయాల కోసం తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతో పాటు 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా జాతరలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఆర్టీసీ అధికారులు జాతరకు వచ్చే భక్తుల కోసం 10నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఏడుపాయలకు తిప్పుతున్నారు. 


నేడు బండ్ల ఊరేగింపు.. 

ఏడుపాయల జాతరలో రెండోరోజు శనివారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం కొనసాగనున్నది.


logo