బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 22, 2020 , T00:35

పందిరి సాగుతో సిరుల పంటలు

పందిరి సాగుతో  సిరుల పంటలు

మెదక్‌, నమస్తే తెలంగాణ : సరైన వర్షాలు లేక పంటల విస్తీర్ణం తగ్గుముఖం పడుతుండడంతో మెదక్‌ జిల్లాలో కూరగాయలు కొనాలంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఇప్పటికే అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం అవసరానికి తగినట్టుగా ఉత్పత్తులు లేకపోవడమే అని చెప్పక తప్పదు. కేవలం మెదక్‌ జిల్లాలోనే కాకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూరగాయల సాగు విస్తీర్ణం చాలా తక్కువగా ఉన్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి కూరగాయలను దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. ఈ సమస్యల నుంచి గట్టేందుకు రైతులను కూరగాయల పంటలు సాగు చేసే దిశగా ప్రోత్సహించాలని సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులను కూరగాయల సాగు దిశగా అడుగులు వేయించేందుకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా పందిరి సాగు పంటలు పండించే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది.

జిల్లాలో 25 ఎకరాల్లో సాగు...

మెదక్‌ జిల్లాలో పందిరి పంటల సాగును ప్రోత్సహించాలన్న ఉద్ధేశంతో జిల్లా ఉద్యాన పంటల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పందిరి పంటలు సాగుచేసేందుకు రైతుల నుంచి గతంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాదికిగాను 25 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా అందులో 22 మంది రైతులను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులు 25 ఎకరాల్లో ఈ పందిరి పంటలను సాగు చేస్తున్నారు. పందిరి సాగుకు అవసరమైన రాతికడీలు, తీగెలు, నీటి సదుపాయం తదితర వాటి కోసం సంబంధిత శాఖ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ.లక్షను జమ చేయనున్నారు. అలాగే ఏఏ పంటలను సాగు చేయాలి, వాటి సస్యరక్షణ చర్యలు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని సంబంధించిన తగిన సలహాలు, సూచనలను సైతం అధికారులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంటతో పాటు మరికొన్ని మండలాల్లో చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే కూరగాయలను, పందిరి పంటలను సాగు చేస్తున్నారు. అయితే జనాభా అవసరాలకు సరిపడే స్థాయిలో దిగుబడులు రావడంలేదు. ఇప్పటి వరకు పట్టణాలు, ఆయా గ్రామాల్లో జరుగుతున్న సంతల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కూరగాయలనే విక్రయిస్తున్నారు. మన జిల్లాలో సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పెట్టుబడి ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది రైతులు ఇతర పంటల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి ఉద్యానవన శాఖ అధికారులు ముందుంటున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనున్నది.

సాగు చేసే పంటలకు మార్కెటింగ్‌ అవకాశాలు...

జిల్లాలో పందిరి సాగు ద్వారా తీగజాతి పంటలను పండించే అవకాశం ఉంటుంది. అందులో కాకర, దొండ, చిక్కుడు, అనపకాయ, ఇతర తీగజాతి పంటలను పండించే అవకాశం ఉన్నది. రైతులు పండించే అన్ని పంటలను స్థానిక మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అమ్ముకునేలా అధికారులు తగిన సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పట్టణాలు, నగరాల్లోనూ సూపర్‌ మార్కెట్లు, హైపర్‌ మార్కెట్లు ఉన్న నేపథ్యంలో వాటికి సరఫరా చేసేలా తగిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. దీంతో అన్నదాత పండించిన పంటలు మంచి ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది.

పందిరిసాగుతో అధిక దిగుబడి 

ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ వస్తున్న జిల్లాలోని రైతులకు పందిరి సాగు కొత్తనే చెప్పాలి. కానీ వరి, చెరుకు, పత్తి, మొక్కజొన్న పంటలను మాత్రమే సాగు చేస్తూ నష్టాలు చవిచూస్తున్న వారికి ఈ పందిరి పంటలు లాభాలు సమకూరుస్తాయనే ఆశ వ్యక్తమవుతున్నది. అలాగే నిత్యం కూరగాయలు అమ్మకం వల్ల వారికి ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని చెప్పవచ్చు. జిల్లా నుంచి మెరుగైన రవాణా సదుపాయాలు కూడా ఉండడంతో రైతులకు మరింత మేలు చేకూరనున్నది. మొత్తానికి పందిరి పంటలు రైతులకు సిరులు పండించనున్నాయి.

రాయితీలు ...

కూరగాయల సాగు అనగానే చాలా మంది రైతులు చెట్ల సాగువైపే మొగ్గు చూపుతారు. అయితే దీనికి భిన్నంగా శాశ్వత పందిరి విధానంలో కూరగాయల సాగు చేసే దిశగా రైతులను ఆకర్శించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి కూడా పందిరి సాగు అంటే ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అందుకోసం కడీలు, తీగల ఏర్పాటు చేయాలి. మధ్యలో బిందు సేద్యం(డ్రిప్‌) పరికాలు అమర్చాల్సి ఉంటుంది. వీటితో పాటు సాగు పెట్టుబడి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కలిపి భారీగా వ్యయం అవుతున్నది. అయితే సంబంధిత పెట్టుబడిలో రాయితీ కింద రైతులకు రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా పెట్టుబడి బ్యాంకు రుణంగా అందనున్నది.


logo