ఆదివారం 29 మార్చి 2020
Medak - Feb 22, 2020 , T00:20

శివనామ స్మరణతో మార్మోగిన కొప్పోల్‌ ఆలయం

శివనామ స్మరణతో మార్మోగిన కొప్పోల్‌ ఆలయం

పెద్దశంకరంపేట : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ కొప్పోల్‌ ఉమాసంగమేశ్వర ఆలయం శుక్రవారం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వయంభులింగంగా వెలసిన శివలింగానికి జలాభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అన్నపూజ, ఆకులపూజ, అభిషేకాలు, యజ్ఞం, లక్షబిల్వార్చన, హారతి, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆయా శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షను ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, పేట ఎస్‌ఐ సత్యనారాయణలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు హాజరై పూజలు నిర్వహించారు.

కొప్పోల్‌కు కాలినడకన శివస్వాములు

కొప్పోల్‌ ఉమాసంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు కొప్పోల్‌కు కాలినడకన శివస్వాములు ఇరుముడులతో తరలివెళ్లారు. పెద్దశంకరంపేట మండలంతో పాటు టేక్మాల్‌, పాపన్నపేట, అల్లాదుర్గం, రేగోడ్‌, కల్హేర్‌, నారాయణఖేడ్‌ మండలాల శివస్వాములు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గురుస్వాముల సమక్షంలో ఇరుముడులు స్వామి వారికి సమర్పించి మాల విరమణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పద్మ, రాయిని విఠల్‌, కందుకూరి నర్సింహులు, ప్రభులు, సంగమేశ్వర్‌, పరమేశ్వర్‌రెడ్డి, నర్సింహులు, ఆర్‌ఎన్‌ లక్ష్మీనారాయణ, శంకరయ్య, పీకే అనంత్‌రావు పాల్గొన్నారు. 


logo