ఆదివారం 29 మార్చి 2020
Medak - Feb 22, 2020 , T00:15

ఆదర్శ గ్రామం దిశగా పోతారం

ఆదర్శ గ్రామం దిశగా పోతారం

మనోహరాబాద్‌: ఒకప్పుడు మురుగు గుంతలు, చెత్తాచెదారంతో, పారిశుధ్య నిర్వహణ లోపంతో దర్శనమిచ్చే మారుమూల పల్లెలు నేడు పట్టణాలను తలదన్నే రీతిలో తయారయ్యాయి. పల్లెలు అభివృద్ధి పథంలో నడిస్తేనే రాష్ట్రం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుందని, పల్లెలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా మారాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మొదటి, రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాన్ని అందించాయి. గ్రామస్తులంతా సమిష్టి కృషితో రోడ్లను శుభ్రపర్చడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకుంటున్నారు. మనోహరాబాద్‌ మండలంలో ఆదర్శ గ్రామంగా నిలిచేందుకు పోతారం పోటీపడుతున్నది. యువకులు, మహిళలు, గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి తమ గ్రామాలను శుభ్రపరుచుకున్నారు. మార్పు తమ ఇంటి నుంచే మొదలవ్వాలనే పిలుపును ప్రజలు స్వీకరించారు. గ్రామసభల్లో సర్పంచ్‌, కార్యదర్శి, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రగతి ప్రణాళిక అంశాలను వివరించడంతో ప్రజల్లో చైతన్యం కనిపించింది. దీంతో తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామంటూ ముందుకు సాగారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడం, కలుపు మొక్కలను తొలగించడం, పెంటకుప్పల తరలింపు, పారిశుధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని గ్రామాన్ని శుభ్రపరుచుకున్నారు. ఇందులో నాయకులు, యువకులు, మహిళలు ముఖ్యపాత్ర పోషించారు. ప్రగతి ప్రణాళిక అనంతరం ప్రతి ఆదివారం గ్రామాభివృద్ధి కోసం సమయం కేటాయిస్తామని ముందుకు వస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడకం నియంత్రణపై తీర్మానం చేసిన గ్రామస్తులు దుకాణదారులకు నోటీసులు అందజేయాలని అధికారులకు విన్నవించారు. హరితహారం మొక్కలను నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వైకుంఠధామం పూర్తి కాగా, డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. గ్రామస్తులు, యువకులు నిరంతరం రోడ్లను శుభ్రపర్చడం, హరితహారం మొక్కలకు నీళ్లుపోయడం, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.  


logo