బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Feb 21, 2020 , 06:11:08

ఏడుపాయలకు జాతర శోభ

ఏడుపాయలకు జాతర శోభ

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ / పాపన్నపేట : తెలంగాణ రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ర్టాల భక్తులను ఆకట్టుకునే జానపదుల జాతరగా పేరొందిన ఏడుపాయల జాతర ప్రారంభానికి సర్వం సిద్ధమైనది. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభకార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ హాజరై దుర్గామాతకు పట్టు వస్ర్తాలు సమర్పించడంతో మూడు రోజుల పాటు జరిగే జాతర ప్రారంభం కానున్నది. ఉత్సవ కమిటీ సభ్యులు బాలాగౌడ్‌, గంగారెడ్డి, దుర్గయ్య, వీరేశంలతో పాటు ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ ఇతర అధికారులు జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణ కోసం అన్ని శాఖల అధికారులు గురువారం ఏడుపాయలకు చేరుకున్నారు. జాతర జరిగే మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు దుర్గామాతను దర్శించుకోనున్నారు. 


భక్తులకు తాగునీటి నల్లాలను సైతం ఏర్పాటు చేశారు. తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా పొడ్చన్‌పల్లి సమీపాన గల మంజీరా నది నుంచి, 15 ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరుగుదొడ్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సైతం బిగించారు. అత్యవసర సమయంలో వాడటానికి జనరేటర్లను సైతం అందుబాటులో ఉంచారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కోసం పది నిముషాలకు ఒక బస్సు ఉండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు టేకులగడ్డ సమీపాన ఒక ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా, నాగ్సాన్‌పల్లి వైపు వేళ్లే వారికి హరిత రెస్టారెంట్‌ సమీపాన మరో బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. జాతరలో సుమారు 450 మంది పారిశుధ్య కార్మికులు, పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. మంజీరా తీరం వెంట, చెక్‌డ్యామ్‌ వద్ద పెద్ద సంఖ్యలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా క్రేన్‌లు సైతం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అగ్నిమాపక, 108 వాహనాలను సిద్ధంగా ఉంచారు.


ఏడుపాయల జాతరకు రూ.75 లక్షలు మంజూరు..

ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75లక్షలు మంజూరు చేసింది. మరో రూ.25 లక్షల వరకు మంజూరు చేయిస్తామని మంత్రి హరీశ్‌రావు. ఇటీవలే జరిగిన సమీక్షాసమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. 


ఏడుపాయలలో మెడికల్‌ క్యాంపు.. 

ఏడుపాయల జాతరలో ఎవరైనా అనారోగ్యానికి గురై, ప్రమాదాలు జరిగితే అప్పటికప్పుడూ చికిత్సలు నిర్వహించడానికి ఏడుపాయలలో పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి డాక్టర్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డాక్టర్లతో పాటు పారామెడికల్‌ సిబ్బంది పనిచేయనున్నారు. మెయిన్‌ క్యాంపు కాకుండా బస్టాండ్‌ వద్ద పోలీస్‌ ఔట్‌పోస్టు వద్ద ఘనపూర్‌ ఆనకట్ట వద్ద సైతం పారామెడికల్‌ సిబ్బందితో క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. 


నేడు ఉపవాస దీక్షలు చేపట్టనున్న భక్తులు.. 

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏడుపాయలకు చేరుకున్న భక్తులు వేకువజామునే మంజీరానదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గామాత సన్నిధిలో ఉపవాస దీక్షలు చేపడతారు. సాయంత్రం వరకు అమ్మవారి సన్నిధిలో దేవి నామస్మరణలో నిమగ్నమవుతారు. సాయంత్రం నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకుని పండ్లు ఫలాలతో దీక్షలు విరమిస్తారు. ఏడుపాయల్లో జరిగే వివిధ భక్తి కార్యక్రమాల్లో పాల్గొని రాత్రంతా జాగరణ చేస్తారు. ఇందుకోసం ఆలయ అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున వేదికను ఏర్పాటు చేశారు.


మూడు రోజుల పాటు జరుగనున్న జాతర..

ఏడుపాయల జాతర మూడు రోజుల పాటు జరుగనున్నది మొదటి రోజు కుంకుమార్చనలతో జాతర ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌లు హాజరై అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. రెండో రోజు శనివారం బండ్లు తిరిగే కార్యక్రమం కొనసాగనున్నది. సాయంత్రం ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తుంటారు. మూడో రోజు ఆదివారం రథోత్సవం కార్యక్రమం జరుగనున్నది. 


సకల దేవతల నిలయం ఏడుపాయల.. 

ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులు కేవలం వనదుర్గామాతనే కాకుండా ఏడుపాయల శివారులో వెలసిన ఇతర దేవతలను దర్శించుకుని వెళ్తుంటారు. నాగ్సాన్‌పల్లి కమాన్‌ నుంచి ఏడుపాయలకు చేరుతుండగా నాగ్సాన్‌పల్లి శివారులో సంతోషిమాత, దత్తాత్రేయ, శివాలయాలు ఉన్నాయి. ఇక నగ్సాన్‌పల్లి గేటు సమీపాన మురళీకృష్ణ దేవాలయం సైతం ఉన్నది. ఒక ఏడుపాయలకు చేరుకోగానే తాత్కాలిక పోలీసు క్యాంపు ప్రక్కన గణపతి ఆలయం ఉన్నది. అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లగానే దేవాదాయ శాఖ కార్యాలయం వెళ్లే మార్గంలో శివాలయం ఉన్నది. అక్కడి నుంచి రాజగోపురం దగ్గరలోనే ముత్యాలమ్మ ఆలయం ఉన్నది. ఇవే కాకుండా దుర్గామాత ఆలయం పైన గల గుట్టపై మునిపుట్ట ఉంటుంది. ఏడుపాయలకు వచ్చే భక్తులు కేవలం దుర్గామాతనే కాకుండా ఆయా దేవాలయాలకు వెళ్లి సకల దేవతలను దర్శించుకుంటారు. logo