మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 21, 2020 , 06:09:50

గజ్వేల్‌ తరహాలో తూప్రాన్‌ అభివృద్ధి

గజ్వేల్‌ తరహాలో తూప్రాన్‌ అభివృద్ధి

మనోహరాబాద్‌ / తూప్రాన్‌ రూరల్‌ : గజ్వేల్‌ తరహాలో తూప్రాన్‌ మారబోతున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తూప్రాన్‌ మున్సిపల్‌ మొదటి సాధారణ సమావేశాన్ని చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ పాలకవర్గ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తూప్రాన్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. తూప్రాన్‌ మున్సిపల్‌ అభివృద్ధికి ప్రత్యేక చొరువ చూపుతున్నామన్నారు. పట్టణంలోని సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాల్వల నిర్మాణానికి ప్రైవేటు కన్సల్టెంట్‌ ద్వారా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించామన్నారు. పాత విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్తవి వేయడం, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ను సరిచేయడం తదితర అంశాలతో తూప్రాన్‌ను మోడ్రన్‌ సిటీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గజ్వేల్‌ తరహాలో ప్రభుత్వ కార్యాలయాలు, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ తదితర అభివృద్ధి పనులను అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. తూప్రాన్‌ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు వెడల్పులో భవనాలు కోల్పోతున్న వారితో చర్చించారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని, బాధితులు కోరిన విధంగా వ్యక్తిగత నిర్మాణాలకు సంబంధించిన పన్నులో వెసులుబాటు కల్పిస్తామన్నారు. 


రోడ్డు వెడల్పు పూర్తైతే కేంద్ర నిధులు త్వరగా మంజూరు అవుతాయన్నారు. అదే విధంగా బస్తీల్లో బస్సులు, లారీలు తిరుగలేని పరిస్థితి నెలకొందని, బస్తీలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంటుందని, దీన్ని  అధిగమించేందుకు గజ్వేల్‌లో ఉన్న విధంగా వెడల్పు రోడ్లు చేస్తామన్నారు. దీంతో పాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, భవిష్యత్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నుంచి ఆబోతుపల్లి మీదుగా ఔటర్‌రింగ్‌ రోడ్డును త్వరలోనే నిర్మిస్తామన్నారు. మనోహరాబాద్‌, కాళ్లకల్‌ గ్రామాలకు సైతం రింగురోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛత వైపు మొగ్గుచూపాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పారవేయాలని చెప్పారు. తూప్రాన్‌లో రెండు డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి, ప్రైవేటు దవాఖానలో ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పించడంతో పాటు సిబ్బందిని కూడా పెంచుతామన్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను పుట్టకోటకు తరలించి, ఆ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. దీంతో మున్సిపాలిటీకి లాభదాయకంగా ఉంటుందన్నారు. అదే విధంగా తూప్రాన్‌లో రెండు వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. అంతకుముందు నూతన ట్రాక్టర్‌ను ప్రారంభించారు.


మున్సిపల్‌ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి 

తూప్రాన్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న మున్సిపల్‌ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంట్రాక్టర్‌కు సూచించారు. పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. కూలీలను పెంచి త్వరగా భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు.   


డంపింగ్‌యార్డుకు స్థలాలు సేకరించారా..?

డంపింగ్‌యార్డు నిర్మాణాలకు స్థలాలు సేకరించారా...? అని తహసీల్దార్‌ శ్రీదేవిని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగారు. తూప్రాన్‌లో రెండు డంపింగ్‌యార్డులు అవసరముంటాయని, వీలైనంత త్వరగా డంపింగ్‌యార్డు నిర్మాణానికి స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలన్నారు. తూప్రాన్‌ పట్టణంలో టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో, శ్రీ రామాలయం సమీపంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించామని తహసీల్దార్‌ ఎంపీకి వివరించారు. డంపింగ్‌యార్డుకు చెత్తను తరలించేందుకు ఐదు ట్రాక్టర్లు లేదా టాటా ఏస్‌ వాహనాలను కొనుగోలు చేయాలన్నారు. 


బస్తీలో రోడ్డు వెడల్పును వేగవంతం చేయండి 

తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని బస్తీలో రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందుగా అంతర్గత మురికికాల్వలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. త్వరలోనే మిషన్‌ భగీరథ మాదిరిగా ఇంటింటికీ గ్యాస్‌ పైప్‌లైన్‌ రాబోతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, మున్సిపల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. 


logo
>>>>>>