శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 20, 2020 , 02:27:49

పల్లెలు మరువాలి

పల్లెలు మరువాలి
  • రాష్ట్రంలోనే మెదక్‌ను ఆదర్శంగా అభివృద్ధి చేద్దాం
  • దోమలరహిత జిల్లాగా మారుద్దాం
  • పల్లెప్రగతి రెండు దశల్లో మిగిలిన పనులను వారంరోజుల్లో పూర్తిచేయాలి
  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
  • ఈజీఎస్‌లో రోడ్ల నిర్మాణానికి భారీగానిధులు
  • నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చూడాలి
  • పల్లెప్రగతి పనులలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు
  • సర్పంచ్‌లు, కార్యదర్శుల, విద్యుత్‌ ఏఈలు, డీఈలతోవాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయండి
  • పల్లెప్రగతి సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, రెండు విడుతల్లో పెండింగ్‌ పనులుంటే వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి  హరీశ్‌రావు సూచించారు.బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌లో పల్లెప్రగతి పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధ్యక్షతన  ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పేరుతెచ్చుకోవాలన్నారు. దోమలను నిర్మూలించేందుకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తే రోగాలు రాకుండా నిరోధించవచ్చన్నారు. ఉపాధి హామీ పనుల్లో  రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్‌,కార్యదర్శి, ఏఈ, ఏడీలు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయాలని, ఇందులో సమస్యల వివరాలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పల్లెప్రగతి పనుల్లో  నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించడంతో పాటు కొందరికి మెమో ఇవ్వాలని సూచించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమష్టిగా పనిచేస్తే  సీఎం కలలు కన్న పరిశుభ్రమైన, పచ్చని పల్లెల స్వప్నాన్ని సాకారం చేయవచ్చన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న  ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌లు పల్లెల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

‘పల్లెప్రగతి’ పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాలయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రెండు విడుతల్లో గ్రామాల్లో మిగిలిపోయిన ‘పల్లెప్రగతి’ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సర్పంచులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌లో ‘పల్లెప్రగతి’ పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధ్యక్షతన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులుతో సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజుల్లో ‘పల్లెప్రగతి’ పనులు పూర్తి చేయాలన్నారు. పల్లెప్రగతి ఒకటి, రెండు ఫేజ్‌లలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్రస్థాయి అధికారులు, స్పెషల్‌ స్వాడ్‌ బృందాలు గ్రామాల్లో ఆకస్మికంగా ఎప్పుడైనా పర్యటించవచ్చని పనులు సక్రమంగా లేని గ్రామాల్లోని కార్యదర్శులు, సర్పంచులు, అధికారులు సస్పెండ్‌ అవ్వడం ఖాయమన్నారు. 


వారం రోజుల్లోగా మిగిలిన పోయిన పనులు ఉంటే పూర్తి చేసుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డంపుయార్డులు, శ్మశాన వాటికలు, మరుగుదొడ్ల నిర్మాణాలు 469 గ్రామ పంచాయతీలకు 159 గ్రామాల్లో పనులు ప్రారంభం కాకపోవడంపై మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఏఈలు, శ్మశాన వాటికల నిర్మాణంలో శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో డంపుయార్డుల నిర్మాణం పనులతో పాటు నర్సరీల్లో మొక్కలను పెంచుకోవడం, నాటిన మొక్కలు బతికించుకోవడం కోసం ట్రాక్టర్‌ ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్లను, ఇప్పటికే అన్ని గ్రామాలకు మంజూరు ఇచ్చామని వాటిని సమకూర్చుకుని ‘పల్లెప్రగతి’ పనులు పూర్తి చేయాలని సర్పంచ్‌లను, అధికారులను కోరారు. సీఎం కేసీఆర్‌ ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ.333కోట్లను నిధులను రిలీజ్‌ చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అదనంగా శ్మశాన వాటికలు, డంపుయార్డులు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకునేందుకు మెటీరియల్‌   కాంపొనెంట్‌ బిల్లులు సర్పంచ్‌లకు చెల్లించడానికి ప్రతి నెలా రూ.61కోట్లు సీఎం కేసీఆర్‌ విడుదల చేస్తున్నారని, అందుకు క్యాబినెట్‌ తీర్మానం చేసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.  


‘పల్లెప్రగతి’ పనుల్లో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి..

‘పల్లెప్రగతి’ పనులపై నిర్లక్ష్యం వహించిన రేగోడ్‌ విద్యుత్‌ ఏఈ రాంబాబును సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రేగోడ్‌ మండలంలోని బియంతండా, శంషుతండాల్లో గిరిజన తండాలో నాలుగు రోజులుగా విద్యుత్‌ సరఫరా అంతరాయం ఉందని ఫోన్‌ చేసిన స్పందించలేదని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ చెప్పినా సంబంధిత ఏఈ స్పందించకపోవడంపై  సంబంధిత సర్పంచ్‌ ‘పల్లెప్రగతి’ సభలో ఫిర్యాదు చేయడంతో ఏఈ సరియైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి ఆయనను సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఈ శ్రీనాథ్‌ను ఆదేశించారు.  సర్పంచ్‌, కార్యదర్శి, ఏఈ, ఏడీలు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయాలని ఇది 24గంటల్లో అమలు కావాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి డీఈలు, ఏడీలు, ఏఈలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టర్‌, డీపీవో, ఎస్‌ఈలు సమీక్ష జరుపాలని ఆదేశించారు. 


పలు ఫిర్యాదులకు స్పందించిన మంత్రి.. 

డంపుయార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల కోసం పంచాయతీరాజ్‌ ఏఈలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చేగుంట, పాపన్నపేట, టేక్మాల్‌, రేగోడ్‌ మండలాల ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి చేగుంట మండలానికి  కొత్త ఏఈని నియమించాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికల నిర్మాణాలపై ఎందుకు జాప్యం జరుగుతుందని, స్థలాల కేటాయింపుపై తదితర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ సమస్యలను  పరిష్కరించాలని సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు.

కృష్ణతులసి మొక్కల కోసం 


రూ.20 లక్షలు.. 

జిల్లాలో దోమల నిర్మూలన కోసం కృష్ణతులసి మొక్కల సీడ్‌ను తీసుకువచ్చేందుకు ప్రగతి రిసార్ట్స్‌కు వెళ్లాలని డీఎఫ్‌వో, డీపీవోలను మంత్రి ఆదేశించారు. ఇందుకు రూ.20లక్షలు కలెక్టర్‌ కేటాయిస్తారని చెప్పారు. 469 గ్రామ పంచాయతీల్లో కృష్ణతులసి మొక్కలను నాటాలన్నారు. గ్రామపంచాయతీల్లో నాటిన మొక్కల్లో 80శాతం బతికించే విధంగా సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. 


సమావేశంలో జేసీ నగేశ్‌, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, జిల్లా అధికారులు డీపీవో హనోక్‌, వెంకటేశ్వర్‌రావు, ఇంచార్జి డీపీఆర్వో దేవయ్య, డీఆర్డీవో అధికారి ఉమాదేవి, ఏఎస్పీ నాగరాజులతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.. 

అరవై ఏండ్లలో కేంద్ర, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో కాని పనులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో జరిగాయి. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పోటీపడి పనిచేస్తున్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తమకు సమాచారం ఇస్తే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.


మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ‘పల్లెప్రగతి’తో వచ్చింది..

మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ‘పల్లెప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు విడుతల్లో చేపట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో పారిశుధ్యం, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 


డంప్‌యార్డులు,   వైకుంఠ ధామాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి..

జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంప్‌యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి. స్థల సమస్య ఉన్న గ్రామాల్లో అటవీశాఖకు చెందిన భూములు కేటాయించి నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి. ‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.

- జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌ గౌడ్‌  


సర్పంచులకు నిధులు, విధులు, అధికారాలు వచ్చాయి..

దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మన సీఎం కేసీఆర్‌ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమం వల్ల సర్పంచులకు అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతలు వచ్చాయి. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. హరిత తెలంగాణ ఏర్పాటుకు అందరూ సహకరించాలి.

- మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 


logo