శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medak - Feb 20, 2020 , 02:25:58

యువతకు స్ఫూర్తి శివాజీ

యువతకు స్ఫూర్తి శివాజీ

రామాయంపేట : వీర శివాజీ పౌరుషానికి పెట్టిన పేరు.. ఆయన పోరాటం మరాఠీల ఆత్మగౌరవాన్ని నిలిపిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం రామాయంపేటకు విచ్చేసిన మంత్రి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ శివాజీ పోరాటం మరాఠీలను ఎంతో ముందుకు తీసుకెళ్లిందన్నారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు శివాజీయేనన్నారు. వీర శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.


రామాయంపేటను మాడల్‌ పట్టణంగా మారుస్తాం..

రామాయంపేటను మాడల్‌ పట్టణంగా మారుస్తాం. రామాయంపేట పట్టణంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానన్నారు. మున్సిపల్‌ను దత్తత తీసుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. పట్టణానికి ఈ నెలలోనే ఒకరోజు కేటాయించి ఇక్కడే ఉంటానని, పట్టణ వాసుల స్థితిగతులను స్వయంగా తెలుసుకుంటానన్నారు. మెదక్‌, రామాయంపేట రెండు కళ్లలాంటివన్నారు. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులను తీసుకువస్తానన్నారు. ఆదర్శవంతమైన పట్టణంగా రామాయంపేట రూపురేఖలను మారుస్తామన్నారు. రాబోయే ‘పట్టణ ప్రగతి’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాబోయే ఐదేండ్లలో జిల్లాలోనే ఆదర్శ పట్టణంగా తీర్చి దిద్దుతామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు చేగుంట వరకు వచ్చాయని త్వరలోనే కాలుష్యంలేని పరిశ్రమలను రామాయంపేటకు తీసుకువస్తామన్నారు. త్వరలోనే పట్టణానికి ‘కాళేశ్వరం’ ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఇప్పటికే రాష్ట్రం ముందుందన్నారు.  


పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం..: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

రామాయంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే పద్మాదేవేంద ర్‌రెడ్డి అన్నారు. పట్టణాభివృద్ధికి చైర్మన్‌, కౌన్సిలర్లు అందరూ భాగస్వాములు కావాలన్నారు. మున్సిపల్‌కు తాగునీరు తాగడానికి కృషి చేస్తామన్నారు. పట్టణాభివృద్ధికి నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నామని తెలిపారు.


పట్టణ సమస్యలపై మంత్రికి వివరణ..

రామాయంపేట పట్టణ సమస్యలపై మంత్రికి మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ వివరించారు. గురువారం శివాజీ విగ్రహావిష్కరణ అనంతరం చైర్మన్‌ తన ప్రసంగంలో మంత్రికి పట్టణంలోని విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఎక్స్‌ప్రెస్‌ బస్టాండు, పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని కోరారు.


పండుగలా శివాజీ జయంతి..

రామాయంపేట పట్టణంలోని ఛత్రపతి శివాజీ జయంతి పండుగలా జరిగింది. బుధవారం ఛత్రపతి జయంతి కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బతుకమ్మలతో ఊరేగింపు, శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ తీశారు. పట్టణంలోని అన్ని యువజన సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. 


ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నగేష్‌, జిల్లా ఏఎస్పీ. నాగరాజు, తూప్రాన్‌ డీఎస్పీ కిరన్‌కుమార్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్‌, మెదక్‌ ఆర్డీవో సాయిరాం, మాజీ జెడ్పీటీసీ సరాఫ్‌ యాదగిరి, రామాయంపేట, నిజాంపేట ఎంపీపీలు నార్సింపేట భిక్షపతి, దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీలు విజయ్‌ కుమార్‌, సంధ్య, రామాయంపేట, నిజాంపేట, కల్వ కుంట, కోనాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్లు బాదె చంద్రం, అందె కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, పట్టణ కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, చంద్రపు కొండల్‌రెడ్డి, దేవుని రాజు, సరాఫ్‌ సౌభాగ్య, సుందర్‌సింగ్‌, బొర్ర అనీల్‌, మల్యాల కవిత, చప్పెట ముత్యంరెడ్డి, కన్నపురం కృష్ణాగౌడ్‌, బాలుగౌడ్‌, యెనిశెట్టి అశోక్‌, మదునాల స్వామిగౌడ్‌, దోమకొండ శ్రీను, పోచమ్మల శ్రీను, లక్ష్మణ్‌ యాదవ్‌, శ్రీకాంత్‌ సాగర్‌, నర్సారెడ్డి, పాతూరి ప్రభావతి, నాగేశ్వర్‌రెడ్డి, నవాత్‌ మహేశ్‌, బాసం శ్రీనివాస్‌, తోట కిరణ్‌, మద్దెల రమేశ్‌, మెట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. logo