మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 20, 2020 , 02:21:54

ముస్తాబవుతున్న ఏడుపాయల

ముస్తాబవుతున్న ఏడుపాయల

పాపన్నపేట:  వనదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోనుంది. ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో ఈ నెల 21 నుండి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర జరుగనుంది. అందుకనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతరను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల హరిత రెస్టారెంట్‌లో కొన్ని రోజుల క్రితం  సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జాతరను వైభవంగా నిర్వహించడానికి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటకే రూ.75 లక్షలు మంజూరు చేసింది. మరో 25 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం విదితమే. ఇటీవల వర్షాభావం వల్ల ఘణపూర్‌ ఆనకట్టలో  నీరు లేక పోవడంతో రెండు రోజులుగా ఘనపూర్‌ ఆనకట్టలోని మడుగుల నుండి మోటార్ల సాయంతో చెక్‌ డ్యాంలోకి నీటిని పంపుతున్నారు. బుధవారం రాత్రి కానీ, గురువారం తెల్లవారుజామున కానీ చెక్‌డ్యాం పొంగిపొర్లే అవకాశాలున్నాయి. 


దీంతో  ఏడుపాయలకు వచ్చే భక్తులకు స్నానాలకు ఇబ్బంది ఉండదు. ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ గత కొన్ని రోజులుగా జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. తాగునీటి సమస్య రాకుండా పొడ్చన్‌పల్లి సమీపాన గల వాటర్‌ స్కీమ్‌ నుండి ఏడుపాయలకు నీరు అందిస్తున్నారు.  దీంతో పాటు 15 వాటర్‌ ట్యాంకర్లను  సిద్ధంగా ఉంచారు. జాతరలో విద్యుత్‌ సమస్య ఎదురుకాకుండా పెద్ద ఎత్తున ట్రాన్స్‌ఫార్మర్లను  బిగించారు. బస్సులను ఆపడానికి బ్రిడ్జిల మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో తాత్కాలిక బస్టాండ్‌ ఏర్పాటు చేసినట్లు మెదక్‌ ఆర్డీవో సాయిరాం వెల్లడించారు. దీంతో పాటు గతంలో మాదిరిగా హరిత రెస్టారెంట్‌ సమీపాన   మరో బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. ఇక జాతరకు వెళ్ళడానికి వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా మూడు మినీ బస్సులు సమకూరుస్తున్నారు. పోతంశెట్టిపల్లి నుండి వచ్చే బస్టాండ్‌ సమీపాన 30 తాత్కాలిక మరుగుదొడ్లు  ఏర్పాటు చేశారు. జాతరలో మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మరుగు దొడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక జాతర మొత్తంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో మూడు వందల నల్లాలను బిగిస్తున్నారు.  బొడ్మట్‌పల్లి, నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌, బీదర్‌  తదితర ప్రాంతాల నుంచి ఏడుపాయల జాతరకు ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులకు తమ వాహనాలను నిలుపుకోవడానికి చెలిమెలకుంట సమీపాన పార్కింగ్‌ స్థలాన్ని  ఏర్పాటు చేశారు. 


పోతంశెట్టిపల్లి వైపు నుండి వచ్చే భక్తులు పైనుండి నడిచి వస్తుంటారు. వారు ప్రమాదాల బారిన పడకుండా ఈ సంవత్సరం ఆ దారిని మూసివేయించారు. అక్కడి నుండి వచ్చేవారు చెలిమెల్లకుంటలో పడే అవకాశం ఉండటంతో ఈసారి ఆ దారి మూయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రయాణీకులు మెయిన్‌ రోడ్డు నుంచి రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా జాతరలో విధులు నిర్వహించడానికి వచ్చే వివిధ శాఖల అధికారుల కోసం చలువ పందిళ్ళు వేస్తున్నారు. ఏడుపాయలలోని వివిధ ఆలయాలకు రంగులు వేయడం దాదాపు పూర్తయ్యింది. ఏడుపాయలలోని అంతర్గత రోడ్ల గుంతలను పూడ్చి విద్యుత్‌ దీపాలు అమర్చే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా మెదక్‌ ఆర్డీవో సాయిరాం, ఏడుపాయల ఈవో శ్రీనివాస్‌ ఏడుపాయలలోని పలు ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ పనులను వేగంగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే మెదక్‌ నుండి నాగ్సాన్‌పల్లి వైపు వెళ్ళే మార్గంలో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా  వివిధ రకాల సైన్‌ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. వీటిని ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై మెదక్‌ ఆర్డీవో మంగళవారం సాయంత్రం వరకు అధికారులకు పలు సూచనలు చేశారు.  భక్తుల సౌకర్యార్థం జాతర ప్రారంభమయ్యే సరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో శ్రీనివాస్‌ వెల్లడించారు. 


logo
>>>>>>