శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 16, 2020 , 00:21:39

క్లీన్‌ స్వీప్‌.. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల విజయభేరి

క్లీన్‌ స్వీప్‌.. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల విజయభేరి
  • 37 సొసైటీల్లో అన్ని సొసైటీలు కైవసం
  • జిల్లాలో హోరెత్తిన గులాబీ సంబురాలు
  • 37 సొసైటీల్లో ఎగిరిన గులాబీ జెండా
  • ఏక్రగ్రీవాలతో కలిపి 481 డైరెక్టర్లలో 415 టీఆర్‌ఎస్‌ విజయం
  • 244 స్థానాలకు ఎన్నికలు
  • జిల్లావ్యాప్తంగా 86.1 శాతం పోలింగ్‌ నమోదు
  • సీఎం కేసీఆర్‌కు జైకొట్టిన రైతన్నలు

సహకార  సంఘాల ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ జైత్రయాత్ర కొనసాగించింది. మొన్నటి పురపోరులో అన్ని స్థానాలను  కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌..సహకార పోరులోనూ అదే జోరు కొనసాగించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు శనివారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 37 సొసైటీల్లో 481 డైరెక్టర్‌ స్థానాలుండగా, నామినేషన్ల ఉపసంహరణ నాటికి 237 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. 244 స్థానాలకు ఎన్నికలు జరగగా, 86.1 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి ఓటేశారు. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారికి సిబ్బంది, పోలీసులు సాయమందించడంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన వాటిల్లో 244  స్థానాల్లో  215 చోట్లటీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయబావుటా ఎగురేశారు. ఎన్నికలకు ముందు ఐదు సొసైటీలు ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో పాటు ఎన్నికల్లో మిగిలిన 32 స్థానాలను టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు కైవసం చేసుకోవడంతో  టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించాయి.  ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఏవైనా అనివార్య ఘటనలు చోటుచేసుకుంటే మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి దంపతులు మెదక్‌లో తమ   ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  జిల్లాలో శనివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. జిల్లాలోని 37 సహకార సంఘాల్లోని 481 డైరక్టర్‌ స్థానాల్లో 415 డైరక్టర్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని విజయదుందుభి మ్రోగించింది. 37 సహకార సంఘాల్లో 5 సహకార సంఘాలు ఏకగ్రీవం కాగా, 5 సహకార సంఘాల్లోని 65 డైరక్టర్‌ స్థానాలతో పాటు 337 డైరక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 32 సహకార సంఘాల్లోని 244 డైరక్టర్‌ స్థానాలకు 539 మంది పోటీ పడ్డారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఫలితాలు వెల్లడించారు. 244 డైరక్టర్‌ స్థానాలకు ఎన్నికల్లో 215 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు దారులైన అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారులు  కేవలం 54 డైరెక్టర్‌ స్థానాలను మాత్రమే గెలుపొందింది. మిగతా 12 డైరెక్టర్‌ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 

జిల్లాలో 86.1 శాతం పోలింగ్‌..

శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. 32 సహకార సంఘాల్లోని 244 డైరెక్టర్‌ స్థానాల పరిధిలో 28,363 ఓట్లు ఉండగా ఇందులో 24,407 ఓట్లు పోలయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 86.1శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. చేగుంటలోని ఇబ్రహీంపూర్‌ సొసైటీలో 12 వార్డుకు జరిగిన ఎన్నికల్లో ఓ వ్యక్తికి ఓటేసేందుకు సహాయకుడిగా వెళ్లిన రమేశ్‌ అనే వ్యక్తి సదరు వ్యక్తి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్‌ పేపర్‌ను నోట్లో పెట్టుకోవడంతో కొంత గందరగోలం నెలకొంది. వెంటనే తేరుకున్న అధికారులు బ్యాలెట్‌ పేపర్‌ను నోట్లో నుంచి తీయించి పక్కన పెట్టారు. తీరా ప్రత్యర్థి 37 ఓట్ల మోజార్టీతో గెలుపొందడంతో ఇక్కడ ఎలాంటి సమస్య చోటు చేసుకోలేదు. మెదక్‌ జూనియర్‌ కళాశాలలో జరిగిన సహకార సంఘం పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ ధర్మారెడ్డి పరిశీలించారు. జిల్లా సహకార శాఖ అధికారి పద్మ టేక్మాల్‌ ఇతర సహకార సంఘాల పోలింగ్‌ తీరును పరిశీలించారు. 

ఓటేసిన ప్రముఖులు..

మెదక్‌ సహకార సంఘం ఎన్నికల్లో కూచన్‌పల్లి గ్రామ రైతుగా అవార్డుకు సంబంధించిన పోలింగ్‌ బూత్‌లో సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి దంపతులు మెదక్‌ జూనియర్‌ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెల్దుర్తి సహకార సంఘం 3వార్డు  పోలింగ్‌ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  logo