ఆదివారం 24 మే 2020
Medak - Feb 16, 2020 , 00:05:32

మాతాశిశు మరణాలు తగ్గించాలి

మాతాశిశు మరణాలు తగ్గించాలి
  • వైద్య ఆరోగ్య సిబ్బంది శిక్షణ సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌, నమస్తే తెలంగాణ : గర్భిణులకు ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్‌ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్య ఆరోగ్య సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీగా నిర్ధారణ అయిన నుంచి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని అనే అంశాలపై గర్భిణులతో పాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.  క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలతో పాటు ఇతర సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోషక పదార్థాలు సరైన మోతాదులో తీసుకోకపోవడంతో ప్రసవ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సమస్యలను ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఆహారాన్ని తీసుకోవాలనే అంశాలపై సరైన అవగాహన కల్పించాలని సూచించారు.  అలాగే ప్రసవం జరిగిన నాటి నుంచి రెండు సంవత్సరాల వరకు సైతం పిల్లల ఎత్తు, ఎదుగుదలను గమనిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. 


 వైద్యులు సైతం అనేక ఒత్తిడికి లోనవుతున్నారని ఇలా అయితే తమ వద్దకు వచ్చే రోగులకు సరైన వైద్యం అందించలేరన్నారు. యోగా, ధ్యానం ఆరోగ్యంపై పలు రకాల ప్రభావాలను చూపుతాయని ప్రతి ఒక్కరూ వీటిని ఆచరించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది తమ వద్దకు వచ్చే రోగులతో సఖ్యతతో ఉండాలని కావాల్సిన సహాయ, సహకారాలను అందజేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ నీలిమాసింగ్‌, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ పి.చంద్రశేఖర్‌, డీఐవో సుమిత్రరాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo