శనివారం 30 మే 2020
Medak - Feb 15, 2020 , 00:02:23

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 37 సహకార సంఘాలుండగా 5 సహకార సంఘాలు ఏకగ్రీవం కాగా, 32 సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 32 సహకార సంఘాల్లోని 244 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 539 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 244 డైరెక్టర్‌ స్థానాల పరిధిలో 28,363 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శుక్రవారం జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, అల్లాదుర్గం కేంద్రాల్లో ఎన్నికల అధికారులకు బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు. వారికి కేటాయించిన వాహనాల్లో తొమ్మిది రూట్లలో 18 మంది అధికారుల పర్యవేక్షణలో పోలీస్‌ అధికారుల బందోబస్తు మధ్య సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ముగ్గురు విధులు నిర్వహించనున్నారు. జిల్లా మొత్తంగా 244 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 269 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 316 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, 311 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది, 32 మంది ఎన్నికల అధికారులతో పాటు సుమారు రిజర్వ్‌ సిబ్బందితో కలిపి 750 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మెదక్‌, నర్సాపూర్‌, అల్లాదుర్గం కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేసిన అనంతరం సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాల్లో వాహనాల్లో పంపించారు. 

నేడు తేలనున్న 539 మంది భవితవ్యం..

జిల్లాలో 37 సహకార సంఘాల్లోని 481 డైరెక్టర్‌ స్థానాలకు 237 డైరెక్టర్‌ స్థానాలు, ఐదు సహకార సంఘాల్లో మొత్తం డైరెక్టర్లు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 244 డైరెక్టర్‌ స్థానాలకు శనివారం ఉదయం పోలింగ్‌ జరుగనున్నది. 244 డైరెక్టర్‌ స్థానాల్లో 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందించనున్నారు. 

బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సామగ్రి పంపిణీ.. 

మెదక్‌, నర్సాపూర్‌, అల్లాదుర్గం కేంద్రాల్లో మొత్తం 244 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. మెదక్‌లో డీసీవో పద్మ, సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి సాధిక్‌ అలీల పరవేక్షణలో మెదక్‌లోని జూనియర్‌ కళాశాల మైదానంలో పంపిణీ జరిగింది. సిబ్బందికి భోజన వసతిని కల్పించారు. నర్సాపూర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రారు శంకర్‌ ఆధ్వర్యంలో పోలింగ్‌ సామగ్రి పంపిణీ జరిగింది. అల్లాదుర్గంలో సహకార శాఖ అధికారి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు.  


logo