సోమవారం 30 మార్చి 2020
Medak - Feb 15, 2020 , 00:01:23

హరితహారం అద్బుతం..

హరితహారం అద్బుతం..

కొల్చారం/వెల్దుర్తి : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం అనూహ్యంగా లభించింది. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో అడవుల శాతం 23 శాతానికి పడిపోయి, పెను ప్రమాదంగా తయారైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది. 23శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచే దిశగా సీఎం కేసీఆర్‌ ‘హరితహారం’ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు.  ప్రభుత్వం హరితహారంలో ఆటవీ భూములతో పాటు ఖాళీస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాల్లో, రోడ్డుకు ఇరువైపుల, చెరువు, పొలాల గట్లపై ప్రతి సంవత్సరం మొక్కలను నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ 2015లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టారు. ఇందుకోసం గ్రామాల వారీగా నర్సరీలను ఏర్పాటు చేసి అవసరమైన మొక్కలను పెంచే బాధ్యతలను నర్సరీల నిర్వాహకులకు అప్పగించారు. ఇందులో భాగంగా  మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోని దామరంచ అటవీ బీట్‌ పరిధిలోని దామరంచ-కొంగోడు గ్రామాల శివారులోని అటవీ భూముల్లో రెండేళ్ల క్రితం హరితహారం కార్యక్రమంలో పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పాటు మిశ్రమ జాతి మొక్కలను నాటారు. 55 హెక్టార్ల పరిధిలోని ఐదు కంపార్టుమెంట్లలో మొత్తం 84,200 మొక్కలను నాటారు.


నాటిన మొక్కల సంరక్షణ కోసం దామరంచకు చెందిన నలుగురు, కొంగోడుకు చెందిన ఒక వ్యక్తి మొత్తం ఐదుగురు వ్యక్తులను నియమించి వారికి బాధ్యతలను అప్పగించారు. దీంతో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కలు నాటిన ప్రాంతంలో తిరుగుతూ మొక్కలను సంరక్షిస్తున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటుతున్నారు. మొక్కలు నాటిన ప్రాంతంలోకి పశువులు, మేకలు, గొర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే కాలంలో ఈ మొక్కలు ఏపుగా పెరిగి దట్టమైన అడవిని తలపించనున్నాయి. కాగా ఇటీవలే టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు జగన్మోహన్‌రావు ఈ రోడ్డు వెంబడి ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి వెళ్తూ మొక్కలు నాటిన ప్రదేశాన్ని సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొక్కలకు కాపలాగా ఉన్న రాములు, విఠల్‌లతో మాట్లాడి మొక్కలు నాటిన విధానం, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు సుమారు 80 వేల మొక్కలను సంరక్షించడం ఎంతో ఆశ్చర్యం వేసిందని, రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది గులాబీ సైనికులు ఒక్కో మొక్కను నాటి సంరక్షించినా.. దీంతో సీఎం కేసీఆర్‌ కళలు కన్న 33శాతం అడవులు సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటాలన్న మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఒక్క గులాబీ కార్యకర్త మొక్కలను నాటే కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.

మొక్కలను నాటి కంటికి రెప్పలా కాపాడాలి

సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం ముఖ్యం కాదు. నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడటం గ్రేట్‌. దామరంచ అటవీబీట్‌లో ఐదు కంపార్ట్‌మెంట్ల పరిధిలో సుమారు 80వేల మొక్కలను నాటి, వాటిని నిత్యం కాపాడుతూ స్వంతంగా ఎదిగే స్థాయికి చేర్చడం చాలా అశ్చర్యం వేసింది. నాలుగేండ్ల క్రితం సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహరం ఫలాలు ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. దామరంచ అటవీ బీట్‌లో నాటిన మొక్కలు హరితహారం కార్యక్రమానికి నిదర్శనం. 

- జగన్మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు

హరితహారం.. అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమం అందరి బాధ్యత. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఈ హరితహారంలో భాగస్వాములై తమవంతుగా మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఇండ్ల వద్ద, పెరట్లో పూలు, పండ్ల మొక్కలను నాటడం, రైతులు పొలాల గట్లపై, ఆదాయానిచ్చే టేకు, పండ్ల మొక్కలను నాటుకోవాలి. మొక్కల కోసం ప్రతి గ్రామంలో ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టింది. 

- భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ దామరంచ


మొక్కలను పశువులు, మేకలు మేయకుండా కాపాడుతున్నాం..

దామరంచ అటవీబీట్‌ పరిధిలో ఐదు కంపార్ట్‌మెంట్లలో రెండేండ్ల క్రితం హరితహారంలో మొక్కలను నాటాం. అప్పటి నుంచి ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు మొక్కల సంరక్షణ కోసం ఒక్కొక్కరం కాపలాదారులుగా ఉంటూ మొక్కలను సంరక్షిస్తున్నాం. మొక్కలను పశువులు, మేకలు, గొర్రెలు మేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు మొక్కలు నాటిన కంపార్ట్‌మెంట్లలో తిరుగుతూ మొక్కలను కాపాడుతున్నాం. మొక్కల పెంపకం మాకు  సంతోషాన్ని కలిగిస్తుంది. 

-  పెట్టరి విఠల్‌, మొక్కల కాపలాదారుడు


logo