బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 14, 2020 , 23:59:16

గోడ చిత్రం.. అవగాహన పత్రం

గోడ చిత్రం.. అవగాహన పత్రం
  • గ్రామాల్లో పారిశుద్ధ్య అవగాహన చిత్రాలు
  • కృషి చేస్తున్న స్వచ్ఛభారత్‌ మిషన్‌
  • ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యం

పెద్దశంకరంపేట: గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు గోడలపై బొమ్మలు వేయిస్తున్నారు. బొమ్మల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం, వ్యర్థాల పారబోత, ఇంకుడు గుంతల నిర్మాణాలు, వాటివినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, అంటువ్యాధుల నిర్మూలన, చెత్త సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లోని కూడళ్ల వద్ద, పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, జనసంచారం ఎక్కువగా ఉండే చోట ఈ బొమ్మలను వేయిస్తున్నారు. ప్రతిగ్రామంలో కనీసం నాలుగు చొప్పున చిత్రాలను గీయించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా ఈ బొమ్మలపై స్వచ్ఛగ్రామం పేర్లను రాయించారు. 

27 గ్రామపంచాయతీల్లో...

పెద్దశంకరంపేట మండలంలోని 27 గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, సబ్‌సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర భవనాలపై ప్రజలకు అందుబాటులో ఉన్నచోట గ్రామానికి నాలుగు చొప్పున బొమ్మలు వేయించారు. ఇలా ప్రజల్లో చైతన్యం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు కేవలం అవగాహన పెంచితే సరిపోదని గ్రహించి వారికి నిత్యం కనపడేలా చిత్రాలు ఉండాలనే లక్ష్యంతో ఆసక్తికరంగా ఉన్న చిత్రాలు గీయించి వాటిపై చైతన్యం వచ్చేలా రాయించారు. దీంతో గ్రామీణ ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకంతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా చిన్నారుల మలాన్ని బయటే వదిలేయకుండా టాయిలెట్లలో వేసే విధంగా మహిళలకు అవగాహన కల్పించే దిశగా ఈ చిత్రాలు ఉండటం వల్ల ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంటున్నది. ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల పరిశుభ్రతపై వివరించారు. పారిశుధ్య కార్మికుల ఏర్పాటుతో పాటు ప్రతీ గ్రామంలో డంప్‌యార్డులు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు అందించగా నీటి ట్యాంకర్లను అందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రజల్లో కూడా మార్పు వచ్చి బహిరంగ మల విసర్జన చేయకుండా వ్యర్థాలను ఆరుబయట పారబోయకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.logo