సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 14, 2020 , 23:53:02

‘పది’లో ఉత్తమ ఫలితాలను సాధించాలి

‘పది’లో ఉత్తమ ఫలితాలను సాధించాలి
  • జిల్లా విద్యాధికారి రమేశ్‌ కుమార్‌

రేగోడ్‌ : పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని డీఈవో రమేశ్‌ కుమార్‌ సూచించారు. మండల కేంద్రమైన రేగోడ్‌ మాడల్‌ పాఠశాల, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన విషయాల గురించి  ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కస్తూర్బా ప్రత్యేకాధికారి స్వయంప్రభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

అల్లాదుర్గంలో..

అల్లాదుర్గం : పదోతరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధనను అందించాలని డీఈవో రమేశ్‌ కుమార్‌ సూచించారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలను సాధించడానికి, విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలను అడిగారు. అలాగే పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంఈవో పోచయ్య, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు. 

ఇష్టంతో చదువాలి.. 

వెల్దుర్తి : ఇష్టంతో చదివితేనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని జిల్లా విద్యాధికారి రమేశ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని బండపోసాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు ఉదయం జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించి, విద్యార్థులకు ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు. అలాగే పది విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, పరీక్షలకు సిద్ధమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ పదోతరగతి ఎంతో కీలకమైందని, భవిష్యత్‌ను నిర్ణయించేది పదోతరగతి అన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాంకిషన్‌, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. 

మెదక్‌ రూరల్‌లో..

మెదక్‌ రూరల్‌ : మంచిగా చదువుకుని ప్రయోజకులు కావాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌ కుమార్‌ అన్నారు. గురువారం రాత్రి మంబోజిపల్లిలో గీతా ఉన్నత పాఠశాలలో గీతా విద్యాసంస్థల 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విద్యాధికారి రమేశ్‌ కుమార్‌ హాజరైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతకుముందు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, జిల్లా నోడల్‌ అధికారి మధు మోహన్‌, గీతావిద్యాసంస్థల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వార్షికోత్సవానికి హాజరైన అతిథులకు గీతా విద్యాసంస్థల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవంలో మంబోజిపల్లి గీతా పాఠశాల ప్రిన్సిపాల్‌ మాధవితో పాటు గీతా విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


logo