శనివారం 29 ఫిబ్రవరి 2020
ప్రచారం ముగిసింది..

ప్రచారం ముగిసింది..

Feb 14, 2020 , 00:16:12
PRINT
ప్రచారం ముగిసింది..
  • రేపే ‘సహకార’ ఎన్నికలు
  • 16న ఆఫీస్‌బేరర్స్‌ సమావేశం
  • ఆ తరువాత కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి
  • ఉదయం 7గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్‌
  • 244 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • 237 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం..
  • 244 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు

సహకార ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో  ఆయా కేంద్రాల వద్ద అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 37 సహకార సంఘాలు ఉండగా, వీటి పరిధిలో 481 డైరెక్టర్‌ స్థానాలు ఉన్నాయి. ఇందులో 237 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 244 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  244 డైరెక్టర్‌ స్థానాలకు 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  800 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. 9 రూట్లుగా విభజించి వాహనాలను పోలింగ్‌ సిబ్బందిని, ఎన్నికల అధికారులను పోలింగ్‌ స్టేషన్లకు తరలించనున్నారు.  రేపు ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి, ఫలితాలు వెల్లడించనున్నారు. 16వ తేదీన ఆఫీసు బేరర్స్‌ సమావేశం నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. 


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వారం రోజులుగా వేడెక్కిన సహకార ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తమైంది. సహకార ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకున్నది. ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడింది మొదలు గురువారం వరకు అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేశారు. 6, 7, 8 తేదీల్లో నామినేషన్లు దాఖలు కాగా, 9న పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అదే రోజు  పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతోపాటు గుర్తులను కేటాయించింది. రేపు జరిగే సహకార ఎన్నికల పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలో 37 సహకార సంఘాలు ఉండగా ఇప్పటికే ఐదు సహకార సంఘాలతో పాటు 237 డైరక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 481 డైరెక్టర్‌ స్థానాలకు గాను 237 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా 244 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 539 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 11 సహకార సంఘాల్లో మోజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. జిల్లా మొత్తంగా మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించి, ఎప్పటికప్పుడు ప్రచారం తీరును పర్యవేక్షించారు. దిగువ శ్రేణి నాయకులతో ప్రచార వ్యూహంతో పాటు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డితో పాటు జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రచారం చేశారు. ఇప్పటికే జిల్లాలో మెజార్టీ డైరెక్టర్‌ పదవులను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. జిల్లాలోని 37 సహకార సంఘాలను  టీఆర్‌ఎస్‌ పార్టే చేజిక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ప్రతిపక్ష పార్టీలు డైరెక్టర్‌ స్థానాల్లో పోటీలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ మద్దతుదారులే గెలిచే అవకాశాలు ఉన్నాయి. 

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు తరలిన పోలింగ్‌ సామగ్రి.. 

జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, అల్లాదుర్గం కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాలను(డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు) ఏర్పాటు చేశారు. జిల్లా డీసీవో కార్యాలయం నుంచి గురువారం  పోలింగ్‌ సామగ్రిని పంపిణీ కేంద్రాలకు తరలించారు. అక్కడ ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి శుక్రవారం బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలతో పాటు పోలింగ్‌ సామగ్రిని ఎన్నికల అధికారులకు అందించనున్నారు. అక్కడ నుంచి 9 రూట్లలో మొత్తం 244 పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను, పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. 

244 డైరెక్టర్‌ స్థానాలకు 539 మంది పోటీ...

244 డైరెక్టర్‌ స్థానాలకు 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 244 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 800 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. 9 రూట్లుగా విభజించి, వాహనాల్లో పోలింగ్‌ సిబ్బందిని, ఎన్నికల అధికారులను పోలింగ్‌ స్టేషన్లకు తరలించనున్నారు. 

15న పోలింగ్‌, 

మధ్యాహ్నం 2 గంటల నుంచి

ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

ఈనెల 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. వెంటనే ఎన్నికైన డైరెక్టర్లకు పాలకవర్గాల సమావేశాలకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వనున్నారు. 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక అధికారికంగా జరుగనున్నది. 


logo